మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!? | Imaginary Friends Child Development Benefits | Sakshi
Sakshi News home page

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

Nov 9 2026 12:29 PM | Updated on Nov 9 2026 12:34 PM

Imaginary Friends Child Development Benefits

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

చిన్నప్పుడు మనతో ఎవరూ లేకపోయినా.. మనసులో మాత్రం ఓ స్నేహితుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. కనిపించకపోయినా అతడితో మాట్లాడటం, ఆటలాడటం, రహస్యాలు పంచుకోవడం చేస్తుంటాం. ఇలాంటి కల్పిత స్నేహితులు (Imaginary Friends) పిల్లల ఊహల్లోనే కాదు.. వారి వ్యక్తిత్వ వికాసంలోనూ కీలక పాత్ర పోషిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. సృజనాత్మకత, ఏకాగ్రత, ఇతరుల భావాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచడంతోపాటు పెద్దయ్యాక ఎదురయ్యే కష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలోనూ వీరు అండగా నిలుస్తారట!

సైకాలజిస్టుల పరిశోధనల ప్రకారం.. ఏడేళ్లలోపు పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి తమ ఊహల్లో సృష్టించుకున్న స్నేహితులు ఉంటారు. అయితే అలా ఉన్నంత మాత్రాన వారికి నిజమైన స్నేహితులు లేరని, ఒంటరిగా ఉంటున్నారని భావించకూడదు. ఇతరులతో కలిసిమెలిసి ఉండటాన్ని ఇష్టపడే పిల్లలు సైతం తమ ఊహల్లో స్నేహితులను సృష్టించుకుంటారు. వీరితో మాట్లాడటం వల్ల కథలు అల్లే నైపుణ్యం, సృజనాత్మకత, ఏకాగ్రత పెరుగుతాయని, మొహమాటం తగ్గి ఇతరుల ఆలోచనలు, భావాలను అర్థం చేసుకునే సామర్థ్యం మెరుగవుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పిల్లల్లో కల్పిత స్నేహాలు..
స్పెయిన్‌లోని వాలెన్సియా యూనివర్సిటీ పరిశోధకులు నాలుగు నుంచి ఆరేళ్ల పిల్లలపై అధ్యయనం చేశారు. ఇందులో కల్పిత స్నేహితులతో గడిపే చిన్నారులు ఇతరుల భావాలు, కోరికలు, ఆలోచనలను బాగా అర్థం చేసుకుంటున్నట్లు గుర్తించారు. అలాగే మెదడు ఎదుగుదలకు సంబంధించిన సమస్య ఉన్న పిల్లలు కూడా ఇలాంటి స్నేహితులను సృష్టించుకుంటున్నట్లు మరో పరిశోధనలో తేలింది.

ఈ సమస్యతో బాధపడుతున్న 124 మంది పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకోగా.. 49 శాతం మంది తమ పిల్లలకు కల్పిత స్నేహితులు ఉన్నట్లుగా తెలిపారు. వీరితో సంభాషించడంతో సామాజిక సంబంధాలను అర్థం చేసుకోవడం, ఇతరులతో మాట్లాడటం వంటి నైపుణ్యాలను అభ్యసించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

సమస్యల పరిష్కారానికి కూడా వీరే తోడు..
నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడంలోనూ కల్పిత స్నేహితులు ఉపయోగపడతారు. ఉదాహరణకు.. పాఠశాలలో ఓ స్నేహితుడు తమకు ఇష్టమైన బొమ్మను తీసుకుంటే.. అలాంటి ప్రవర్తననే తమ కల్పిత స్నేహితుడు కూడా చేస్తున్నట్లు పిల్లలు ఊహించుకుంటారు. అతనిపై కోపం వ్యక్తం చేయడం, తర్వాత క్షమాపణ చెప్పడం, ఇద్దరూ అంగీకరించే పరిష్కారాన్ని కనుగొనడం వంటివి మనసులోనే నేర్చుకుంటారు. దీంతో నిజ జీవితంలోనూ ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, ఇతరుల పట్ల సానుభూతి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

పెద్దయ్యాక కూడా..
కల్పిత స్నేహితుల ప్రభావం బాల్యానికే పరిమితం కాదు. పెద్దయ్యాక కూడా కొందరిలో ఈ అలవాటు కొనసాగుతుందని పరిశోధకులు గుర్తించారు. 56 మంది పెద్దలపై జరిపిన అధ్యయనంలో.. కల్పిత స్నేహితులు ఉన్నవారిలో 68 శాతం మంది.. 20 ఏళ్లలోపు వయసున్న వారిని ఊహించుకున్నట్లు గుర్తించారు. మరో 30 శాతం మంది పెద్దయ్యాకే ఇలాంటి స్నేహితులను ఊహించుకున్నట్లు గుర్తించారు. ఉద్యోగంలో ఎదురయ్యే కష్ట పరిస్థితులు, తోటి ఉద్యోగులతో సంభాషణలు, ముఖ్యమైన సమావేశాలు, ప్రెజెంటేషన్లకు ముందుగా మనసులోనే సాధన చేసుకోవడానికి వీరు అండగా నిలుస్తారని పరిశోధకులు అంటున్నారు.

అయితే, చిన్నతనంలో ఊహల్లో కల్పించుకున్న స్నేహితులు కొందరికి వయసు పెరిగే కొద్దీ దూరమవుతారు. మరికొందరికి మాత్రం జీవితంలోని వివిధ దశల్లోనూ మానసికంగా తోడుంటారు. ఒత్తిడిని తగ్గించుకోవడం, ధైర్యం పొందడం, భారమైన పరిస్థితులను ఎదుర్కోవడం వంటి వాటికి ఈ ఊహించుకున్న స్నేహాలు ఉపయోగపడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి.. కంటికి కనిపించని ఈ స్నేహితులు కేవలం చిన్ననాటి ఆటపాటల్లో మాత్రమే భాగం కాదు.. పిల్లల ఆలోచనా విధానం, భావోద్వేగాలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రభావం చూపే ప్రత్యేకమైన తోడుగా నిలుస్తారన్నమాట!

ఇదీ చదవండి: డిమెన్షియాకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement