సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. బేగంబజార్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి.
కూకట్‌పల్లిలోని ఆస్బెస్టాస్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ టీ కప్పులు, ప్లేట్స్ తయారీ కంపెనీలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్ స్టాక్ గోదాములకు మంటలు వ్యాపించి ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 4 ఫైర్‌ఇంజిన్లతో మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బేగంబజార్‌లోని ఓ భవనంలో బాణసంచా నిప్పులు పడి మంటలు చెలరేగాయి. అగ్నిపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. జీడిమెట్లలోని ఓ స్క్రాప్ దుకాణంలో నిప్పులు పడి మంటలు వ్యాపించాయి. ప్రమాదం ధాటికి షాపులోని స్క్రాప్ అగ్నికి ఆహుతైంది. మైలార్‌దేవ్‌పల్లి ఓల్డ్ విలేజ్‌లోని డెకరేషన్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ బండిమెట్‌లోని డిస్ట్రిబ్యూటర్ డ్రగ్ మార్ట్'లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదాల ధాటికి రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య


