న్యూస్‌మేకర్స్
నగరానికి నీటి సరఫరా మంచినీళ్లు తాగినంత సులభం కాదు. అదీ చెన్నై నగరానికి! గతంలో వాటర్ సప్లై నెట్‌వర్క్, సీవరేజ్ ప్లాంట్స్, భారీ పంపింగ్ నిర్వహణ మగవారే చేశారు. ఇప్పుడు మహిళా ఇంజనీర్లు పగ్గాలు చేపట్టారు. చెన్నై నీటి దేవతల సామర్థ్యాలు అక్కడి ప్రజల దప్పిక తీరుస్తున్నాయి.
నవంబర్ తెల్లవారుజాము... ఐదు గంటలవుతోంది. చెన్నై నగరం ఇంకా నిద్ర లేవలేదు. కానీ కొలత్తూరు వాటర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ లో షిఫ్ట్ డ్యూటీలో ఉన్న ఇంజనీర్ అనన్య (పేరు మార్చబడింది) కళ్లల్లో మాత్రం అప్పుడే అలర్ట్ కదలాడుతోంది. చేతిలో వాకీటాకీ, కళ్లెదురుగా మానిటర్‌లో ప్రెజర్ రీడింగ్... నగరంలోని ఒక ప్రధాన డిస్ట్రిబ్యూషన్ లైన్ లో ప్రెజర్ తగ్గుతోందని సిస్టమ్ చూపిస్తోంది.
ఉదయం సప్లై టైమ్‌కి ముందే దీన్ని సరి చేయకపోతే, చాలా ఇళ్లకు నీళ్లు సరిగా రావు. అనన్య ఒక్క క్షణం కూడా కంగారు పడలేదు. ఫీల్డ్‌లో ఉన్న టెక్నికల్ టీమ్‌ను అప్రమత్తం చేసి, స్టాండ్‌బై పంప్ ఆన్ చేయించి, ఆల్టర్నేట్ లైన్ నుంచి సప్లై మళ్లించి, వాల్వ్ కంట్రోల్స్ సర్దింది. ప్రెజర్ మెల్లగా నార్మల్‌కి వచ్చింది. సరిగ్గా ఉదయం సప్లై మొదలయ్యేసరికి చెన్నై నగరంలోని వంటగదుల్లో నల్లాలు గలగలా వాటర్ స్పీడ్‌ను అందుకున్నాయి. అనన్య నిట్టూర్పు విడిచి, కాఫీ కప్పు అందుకుంది.
నీటి పై పట్టు
సాధారణంగా సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ పనులంటే మగవాళ్లే చేయగలరు అని చెప్తూ వచ్చారు. ఇక వాటర్ బోర్డ్‌లో కిలోమీటర్ల ΄÷డవు పైప్‌లైన్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థలు, రాత్రింబగళ్లు నడిచే పంపింగ్ స్టేషన్ల పర్యవేక్షణ అంటే చాలా శ్రమతో కూడుకున్న పని. కానీ చెన్నై మెట్రోవాటర్ మహిళా ఇంజినీర్లు ఆ పాత మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేశారు.
ప్రస్తుతం ఈ సంస్థలోని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 56 శాతం మంది మహిళలే. ఇది ఒక సంచలనం. బోర్డులో 218 మంది మహిళా ఇంజినీర్లు ఫీల్డ్‌లో ఉంటూ నగర దాహాన్ని తీరుస్తున్నారంటే ఇది ఎంత పెద్ద ఘనతో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం ఐదుగురు చీఫ్ ఇంజినీర్ల కోర్ టీమ్‌లో ఐదుగురూ మహిళలే.
టెక్నాలజీ ఆయువుపట్టు
చెన్నై మెట్రోవాటర్ వ్యవస్థ డిజిటలైజ్ అవుతూ ఉంది. ఇక్కడే మహిళా ఇంజినీర్లు తమ టెక్నికల్ స్కిల్స్‌ను వంద శాతం వాడుకుంటున్నారు. ఎక్కడ లీకేజీ ఉంది? ఏ ఏరియాకు నీటి సరఫరా తగ్గింది? రీసైకిల్ చేసిన నీటి నాణ్యత ఎలా ఉంది? ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని వీరు డేటా అనలిటిక్స్ ద్వారా స్క్రీన్ లపైనే పసిగట్టేస్తున్నారు. నీటి సరఫరా నిరంతరం నడిచే ఎమర్జెన్సీ సర్వీస్ కావడంతో వీరికి ఫిక్స్‌డ్ టైమింగ్స్ లేకపోయినా పని చేస్తున్నారు.
రొటేషనల్ షిఫ్టులు, తెల్లవారుజామున మొదలయ్యే ఫీల్డ్ రౌండ్స్, రాత్రి వేళల్లో మెయింటెనెన్స్ పనులు అన్నీ చేయగలం అని నిరూపిస్తున్నారు. వర్షాలు, వరదలు వస్తే ఒక సవాలు... ఎండకాలం నీటి కరవు మరో సవాలు. అయినా సరే 24 గంటలూ ఫీల్డ్‌లోనే ఉంటూ వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. శారీరక శ్రమతో పాటు మానసిక ఏకాగ్రత, త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అవసరమైన ఈ ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తూ ఒక కొత్త స్టాండర్డ్‌ను సెట్ చేశారు.
రెండు మార్పులు
చెన్నై మెట్రోవాటర్ బోర్డ్‌లో కీ΄÷జిషన్స్ స్త్రీల చేతుల్లో ఉండటం వల్ల సమాజంలో రెండు పెద్ద మార్పులు వచ్చాయి. మొదటిది నగరంలోని ప్రతీ ఇంటికి నీళ్లు అందడంలో ఒక క్రమబద్ధత వచ్చింది. ముఖ్యంగా మురికివాడల్లోని పేద మహిళల నీటి కష్టాలు వీరికి ప్రాక్టికల్‌గా బాగా తెలుసు కాబట్టి సప్లై మేనేజ్‌మెంట్‌లో వివక్ష లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రెండవది ఈ విజయం సమాజంలో కొత్త ఆర్థిక, సామాజిక విప్లవానికి దారి తీసింది.
ఏ స్త్రీలైతే ఇన్నాళ్లూ నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచి, ట్యాంకర్ల వెనుక పరుగులు తీశారో ఆ స్త్రీలే నగరానికి నీటిని సరఫరా చేసే అత్యున్నత వ్యవస్థను లీడ్ చేసే స్థాయికి ఎదిగారు. చెన్నై మెట్రోవాటర్ మహిళా ఇంజినీర్లు కేవలం నీటిని మాత్రమే సరఫరా చేయడం లేదు. ప్రతికూల పరిస్థితిలోనూ ఎలా గెలవవచ్చో చూపిస్తూ రాబోయే తరాల అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే వీరు కేవలం ఇంజినీర్లు మాత్రమే కాదు... చెన్నై నగర దాహాన్ని తీరుస్తున్న నిజమైన ‘నీటి దేవతలు’.


