జస్ట్‌ రూ. 100ల పెట్టుబడితో..ఏకంగా రూ. 1కోటీ టర్నోవర్‌ చేసే వ్యాపారం! | Rs 100 Experiment By Odisha Farmer Turned Into Rs 1 Crore Lemon Business | Sakshi
Sakshi News home page

జస్ట్‌ రూ. 100ల పెట్టుబడితో..ఏకంగా రూ. 1కోటీ టర్నోవర్‌ చేసే వ్యాపారం!

Nov 12 2026 8:14 PM | Updated on Nov 12 2026 8:14 PM

ఏఐ ఫైల్‌ ఫోటో

ఒక రైతు జస్ట్‌  రూ. 100ల పెట్టుబడితో ఏకంగా కోటి టర్నోవర్‌ చేసే వ్యాపారాన్ని సృష్టించి యువ రైతులకు ఆదర్శంగా నిలిచాడు. అంతేగాదు వ్యవసాయంతో వ్యాపారాన్ని సృష్టించి ఎలా లాభాలు ఆర్జించవచ్చో చేసి చూపాడు. 

అతడే ఒడిశాలోని అంగుల్‌ జిల్లాకు చెందిన రైతు సంతోష్‌ సాహు. నిమ్మతోటతో అంతర్జాతీయ వ్యాపారాన్ని సృష్టించి యువరైతులకు మార్గదర్శకంగా నిలిచాడు. సంతోష్‌ సాహు తన తండ్రి ప్రారంభించిన ఒక చిన్న నిమ్మతోటతో కోటి రూపాయలు టర్నోవర్‌ చేసే వ్యాపారంగా మార్చాడు. పైగా 200 మంది రైతులతో నెట్‌వర్క్‌ నిర్మించి అంతర్జాతీయ మార్కెట్‌ని సృష్టించాడు. నిజానికి సంతోష్‌ తండ్రి కార్విక్‌ సాహు ఏనుగులు, కోతుల దాడులను తట్టుకోగల పంట కోసం అన్వేషిస్తూ..నిమ్మసాగుని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. 

అలా ఆయన ఉద్యానవన శాఖ నుంచి 50 కాగ్జీ నిమ్మ మొక్కలను కొనుగోలు చేశారు. ప్రతి మొక్కకు రూ. 2 ఖర్చు చేసి మొత్తం రూ. 100ల పెట్టబడితో చిన్న ప్రయోగం చేయగా అది కాస్తా విజయవంతమైంది. మొక్కలు పెరిగి నిమ్మకాయలు అ‍వ్వడం ప్రారంభించాయి. దాంతో గ్రామంలో ఇతర రైతులు కూడా ఈ నిమ్మ పంటను పండించేందుకు ఆసక్తి కనబర్చారు. సుమారు ఏడేళ్ల క్రితం తన తండ్రి మరణంతో సంతోష్‌ ఈ వ్యవసాయ క్షేత్రం బాధ్యతలు స్వీకరించాడు. అతడు నెమ్మదిగా ఈ చిన్నతోటను ఒక పెద్ద వ్యాపారంగా మార్చాడు. 

రైతులు నిమ్మకాయలు పండిస్తున్నప్పటికీ..కొనుగోలుదారులు పరిమితంగా ఉండటాన్ని గుర్తించాడు. వారిలో చాలామంది తమ పంటను స్థానిక మార్కెట్లలలో అమ్ముకునేవారు. దాంతో పెద్దగా లాభాలు లేకపోవడం గమనించి..తనే ఇతర రైతుల నుంచి నిమ్మకాయలు కొని పెద్ద మార్కెట్లలో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా రైతులు ఎక్కువ మంది కొనుగోలుదారులను చేరుకోవడానికి, అమ్మకాలు జోరందుకోవడానికి సహాయపడింది. 

సంతోష్‌ తన ఎకరం పొలంలో నిమ్మకాయలు పండిస్తాడు..మిగతా 200మంది ఇతర రైతుల నుంచి కూడా నిమ్మకాయలు కొనుగోలు చేసి..అంగుల్, భువనేశ్వర్, కటక్, ధెంకనాల్‌లో అమ్ముతారు. అలా అతడి వ్యాపారం జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌ వరకు  విస్తరించింది. ఇక్కడ పండించే నిమ్మకాయలు అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వరకు ఎగుమతి అవ్వడం విశేషం. సంతోష్‌ ఇతర రైతుల నుంచి 100 నిమ్మకాయలను రూ. 220 నుంచి 280 వరకు కొనుగోలు చేస్తూ..వాటిని రూ. 300 నుంచి 320కి విక్రయిస్తాడు. 

అతని మొత్తం టర్నోవర్‌లో కొనుగోళ్లకే సుమారు 60 శాతం ఖర్చు అవుతుంది. అలాగే అతడు ఒక్కో నిమ్మ మొక్కను రూ. 20ల చొప్పున విక్రయిస్తుంటాడు. అలా అతడు ఏడాది రూ. కోటికి పైగా టర్నోవర్‌ని ఆర్జిస్తున్నాడు. ఇక సంతోష్‌ పండించే నిమ్మని కాగ్జీ నిమ్మ అని పిలుస్తారు. ఇవి పల్చని తొక్కను కలిగి ఉండి, అధిక రసాన్ని అందిస్తాయి. నిమ్మచెట్టు మూడు నుంచి నాలుగేళ్లకు ఫలాలిస్తుంది. 

చెట్టు వయసు పెరిగే కొద్దీ..దిగుబడి పెరుగుతుందట. అంతేగాదు సంతోష్‌ కారణంగా అక్కడ సుమారు 500 కుటుంబాలు ఈ నిమ్మ సాగునే చేస్తూ..లాభాలు ఆర్జిస్తున్నాయట. తాను లాభాలు ఆర్జించడమే గాక చుట్టు పక్కల రైతులకు కూడా మార్గనిర్దేశం చేస్తూ..మరిన్ని లాభాలు అందుకుంటూ అంతర్జాతీయ వ్యాపారాన్ని సృష్టించిన సంతోష్‌ నిజంగా వ్యవసాయ పారిశ్రామికవేత్తగా పిలవొచ్చు కదా..!.  

ఇదీ చదవండి: చేతులకు సంకెళ్లు వేసుకుని 101 కిలోమీటర్ల పరుగు..! చిన్నారులకు ప్రేరణగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement