డయాబెటిస్
కథనం–4
జెస్టేషనల్ డయాబెటిస్
గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక ప్రత్యేకమైన దశ. ఈ సమయంలో తల్లి ఆరోగ్యంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ అవసరం. గర్భం వచ్చిన మహిళల్లో కొందరికి తమకు అంతకుముందు లేని డయాబెటిస్ తాత్కాలికంగా కనిపిస్తుంటుంది. గర్భం దాల్చినప్పుడు కనిపించే ఈ మధుమేహాన్నే ‘జెస్టేషనల్ డయాబెటిస్ మిల్లిటస్’ (జీడీఎమ్) అంటారు. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపే జెస్టేషనల్ డయాబెటిస్ గురించి తెలుసుకుందాం.
ఓ మహిళ తాను గర్భం దాల్చిన 24 నుంచి 28 వారాల సమయంలో ఈ జెస్టేషనల్ డయాబెటిస్ కనిపిస్తుంది. ఇలా గర్భవతిగా ఉన్న సమయంలో వచ్చిన డయాబెటిస్ ప్రసవం అయ్యాక తగ్గిపోయి మళ్లీ పూర్తిగా మామూలైపోవచ్చు లేదా కొంతమందిలో తాత్కాలికంగా కొనసాగవచ్చు. కొందరిలో ప్రసవం తర్వాత తగ్గిపోయినప్పటికీ... ఆ మహిళల్లో కొన్నేళ్ల తర్వాత మళ్లీ డయాబెటిస్ కనిపించవచ్చు.
అసలు ఎందుకు వస్తుంది?
గర్భధారణ సమయంలో మాయ (ప్లాసెంటా) నుంచి విడుదలయ్యే కొన్ని హార్మోన్లు తల్లి శరీరంలో ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తాయి / తగ్గిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడం కష్టమవుతుంది. సాధారణంగా క్లోమగ్రంథి (΄్యాంక్రియాస్) అదనంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సివస్తుంది. కానీ కొందరు మహిళల్లో మాత్రం ఆ స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోవడంతో రక్తంలో షుగర్ పెరుగుతుంది. ఈ కారణంతో గర్భవతుల్లో జెస్టేషనల్ డయాబెటిస్ కనిపిస్తుంది.
ఎవరికి ముప్పు ఎక్కువ?
ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నవారు, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నవారు, గత ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చినవారు, గతంలో అధిక బరువున్న బిడ్డకు జన్మనిచ్చినవారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు ఏవీ లేనివారిలోనూ జెస్టేషనల్ డయాబెటిస్ కనిపించవచ్చు. అంతేకాదు... చాలామందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలూ కనిపించకపోవచ్చు.
ఎలా గుర్తిస్తారంటే...
సాధారణంగా గర్భందాల్చిన మొదటి త్రైమాసికం (ట్రైమిస్టర్)లోనే జెస్టేషనల్ డయాబెటిస్ పరీక్ష చేస్తారు. భారతదేశంలోని డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇండియా – డీఐపీఎస్‌ఐ మార్గదర్శకాల ప్రకారం 75 గ్రాముల గ్లూకోజ్‌ను నీటిలో కలిపి తాగించిన రెండు గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పరీక్షిస్తారు. ఇది స్క్రీనింగ్ పరీక్ష. 140 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువ ఉంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసి జెస్టేషనల్ డయాబెటిస్ అని నిర్ధారణ చేసి, చికిత్స మొదలు పెడతారు.
తల్లీబిడ్డలకు ఎలాంటి ముప్పు?
నియంత్రణలో లేని ఈ చక్కెర వల్ల బిడ్డ సాధారణం కంటే ఎక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు, సిజేరియల్ చేయాల్సిన అవసరం పెరగవచ్చు. ప్రీమెచ్యుర్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుట్టిన వెంటనే బిడ్డ రక్తంలో షుగర్ స్థాయులు పడిపోవడం (నియోనేటల్ హైపోగ్లైసీమియా), శ్వాస సంబంధిత సమస్యల వంటివీ తలెత్తవచ్చు. తల్లికి అధిక రక్తపోటు కనిపించే ప్రీ–ఎక్లాంప్సియా వంటి సమస్యల ముప్పు కూడా పెరగవచ్చు.
ప్రతి ఐదుగురు గర్భిణుల్లో ఒకరిని ప్రభావితం చేసే జెస్టేషనల్ డయాబెటిస్!
ఇటీవల ‘స్ట్రైడ్ స్టడీ’ పేరిట నిర్వహించిన ఓ అధ్యయనంలో జెస్టేషనల్ డయాబెటిస్‌కు గురైన ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి తమ జీవితకాలంలో డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువంటూ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. మన హైదరాబాద్‌తో పాటు తమిళనాడు రాజధాని చెన్నై, పుదుచ్చెరికి చెందిన దాదాపు 3000 మంది మహిళలపై నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నియంత్రణ ఎలా?
ఆహారంలో సరైన మార్పులు, వైద్యుల సూచన మేరకు నడక వంటి వ్యాయామాలు, క్రమం తప్పకుండా రక్తంలో షుగర్ స్థాయులను పరీక్షించుకోవడం ద్వారా చాలావరకు జెస్టేషనల్ డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. డాక్టర్లు అవసరమైతే ఇన్సులిన్‌ను లేదా మరికొన్ని మందుల్ని సూచించవచ్చు. ఈ దశలో గర్భవతులు ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం లేదా ఆకలితో ఉండటం మాత్రం సరైన పద్ధతి కాదు.
చివరగా... గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. అందుకే గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించడం, జెస్టేషనల్ డయాబెటిస్‌పై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. చాలామందిలో గర్భధారణ తర్వాత డయాబెటిస్ తగ్గినా కొంతకాలం తర్వాత మళ్లీ కనిపించే అవకాశాలు కొందరిలో ఉంటాయి. అందుకే జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చినవారు అటు తర్వాత కూడా డాక్టర్ల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.
డాక్టర్ వి. శ్రీదేవి
సీనియర్‌ఆబ్‌స్టెట్రీషియన్ –గైనకాలజిస్ట్
నిర్వహణ: యాసీన్


