పర్యటన
మసాయి మారా
నక్షత్రాల కింద ఒక రాత్రి
ప్రకతి స్వయంగా రాసిన ఒక పెద్ద పుస్తకం
ఆఫ్రికా అనగానే ప్రయాణికులకు ఎక్కువగా గుర్తుకు వచ్చే ప్రదేశమే మసాయి మారా. కెన్యాలోని ఈ విశాలమైన అభయారణ్యం ఒక అడవి కాదు, అది ప్రకతి స్వయంగా రాసిన ఒక పెద్ద పుస్తకం. ప్రతి పేజీలో ఒక కొత్త ప్రాణి, ప్రతి అడుగులో ఒక కొత్త కథ.
ఉదయం 4 గంటలకు జీప్ సఫారీ మొదలవుతుంది. చలిగాలి ముఖాన్ని తాకుతుండగా, జీప్ మెల్లగా గడ్డి మైదానంలోకి వెళ్లిపోతుంది. దూరంగా సూర్యుడు నారింజ రంగులో పైకి వస్తుంటే, ఒక్కసారిగా సింహాల కుటుంబం ఎదురుపడుతుంది. నేషనల్ జాగ్రఫీ ఛానెల్‌లో ఉన్నామా లేదా కలలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. సఫారీ జీపు ముందుకు కదలని పరిస్థితి... ఎందుకంటే తల్లి సింహం తన పిల్లలను ఒళ్లో పెట్టుకుని అక్కడే కూర్చుంటుంది. ఎవరూ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వాటిని గమనిస్తారు. ఎందుకంటే సైలెన్స్ తప్ప మరో ఛాయిస్ ఉండదక్కడ.
ఈ నిశ్శబ్దంలో సింహం శ్వాస కూడా వినిపిస్తుంది. కొద్ది దూరంలో ఏనుగుల గుంపు నెమ్మదిగా నడవడాన్ని, జీబ్రాలు, జిరాఫీలు గడ్డిని తినడాన్ని గమనించవచ్చు. మసాయి మారాలో వన్యప్రాణులు అన్నీ కూడా స్వేచ్ఛగా బతుకుతాయి.
గ్రేట్ మైగ్రేషన్.. కన్నీళ్లు తెప్పించే అద్భుతం..
మసాయి మారాకు ప్రపంచ ప్రసిద్ధి తెచ్చింది గ్రేట్ మైగ్రేషన్. ప్రతి ఏడాది జూలై నుంచి అక్టోబర్ మధ్య లక్షలాది వైల్డ్ బీస్ట్ లు, జీబ్రాలు టాంజానియా నుంచి కెన్యాకు వలస వస్తాయి. మారా నదిని దాటే ఆ దృశ్యం చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ప్రాణం కోసం, బతుకు కోసం వాటి పోరాటం మనకు ఒక అద్భుతంగా అనిపించవచ్చు. కానీ వాటి తపన అర్థం చేసుకుంటే బతుకు పోరాటంలో ప్రతి క్షణం ఎంత కఠినమో అనిపిస్తుంది.
అడవే వారికి దేవుడు
ఈ అడవి మధ్యలోనే మసాయి తెగ ప్రజలు ఉంటారు. ఎర్రటి దుస్తులు, మెడలో రంగురంగుల పూసల దండలు, చేతిలో ΄÷డుగాటి కర్ర. వాళ్ల నవ్వులో ఎంతో అమాయకత్వం కనిపిస్తుంది. వాళ్ల గూడానికి వెళితే, వాళ్లతో కలిసి నృత్యం చేయిస్తారు, వాళ్ల ΄ాటలు వినిపిస్తారు. వాళ్లకు అడవే దేవుడు, ప్రకతే జీవితం. అమాయకత్వమే ఆభరణం.
నక్షత్రాల కింద ఒక రాత్రి
సాయంత్రం సఫారీ అయిపోయాక, టెంట్ లో కూర్చుని ఆకాశం వైపు చూస్తే ముందెన్నడూ చూడనన్ని నక్షత్రాలు, మునుపెన్నడూ చూడనంత దగ్గరగా కనిపిస్తాయి. చుట్టూ నిశ్శబ్దం, దూరంగా సింహం గర్జన, ఇదే మసాయి మారా మాయ.
హైదరాబాద్ నుంచి ఎలా ΄్లాన్ చేయాలి?
ఫ్లైట్: హైదరాబాద్ శంషాబాద్ నుంచి నైరోబీకి ఫ్లైట్స్ ఉన్నాయి. దోహా, దుబాయ్ లేదా అడిస్ అబాబా మీదుగా 10–13 గంటల ప్రయాణం ఉంటుంది. నైరోబీ నుంచి మసాయి మారాకు 45 నిమిషాల డొమెస్టిక్ ఫ్లైట్, లేదా 5–6 గంటల రోడ్డు ప్రయాణం ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చే వాళ్లు వయా హైదరాబాద్ ΄్లాన్ చేసుకోవచ్చు.
వీసా: కెన్యా ఈ–వీసా ఆన్ లైన్ లో 3–4 రోజుల్లో వచ్చేస్తుంది.
బెస్ట్ సీజన్: జూలై నుంచి అక్టోబర్ మధ్యలో గ్రేట్ మైగ్రేషన్ చూసేందుకు వెళ్లవచ్చు.
వసతి: లగ్జరీ లాడ్జ్ ల నుంచి బడ్జెట్ టెంట్ల వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. టెంట్ లో ఉండటం అంటే అడవి మధ్యలో ఉండటమే.
బడ్జెట్: 4 రాత్రులు / 5 రోజుల ట్రిప్ – ఒకరికి రూ. 1.20 లక్షల నుంచి 1.60 లక్షలు ఫ్లైట్, వీసా, సఫారీ, బస, భోజనం కలిపి. లగ్జరీ అయితే 2 లక్షలు పైన ఖర్చు అవుతుంది. ఇది కేవలం ఐడియా కోసం మాత్రమే. నంబర్లు మీ ట్రావెల్ స్టైల్ ను బట్టి మారే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కాలాన్ని మరిపించే కజక్ కథ.. ఇక్కడ ప్రతి వ్యూ స్పెషలే!


