పర్యటన
కజకిస్తాన్
గాలి కూడా ఒక పాటలా వినిపించేంత అందమైనది. మధ్య ఆసియా గుండెల్లో దాగిన మధురానుభూతి. ఎంత చూసినా తనివి తీరని విశాలమైన మైదానాలు, మంచుతో మెరిసే పర్వతాలు, చరిత్రను గుండెల్లో దాచుకున్న నగరాలు... కాలం పరుగులు తీస్తున్నా.. మనిషి మాత్రం ఆగిపోయి ప్రకృతితో మాట్లాడుతాడు. ప్రతి సాయంత్రం ఒక చిత్రంలా ముగుస్తుంది. ప్రతి ఉదయం ఒక కథలాప్రారంభమవుతుంది. ఈ అద్భుతాలన్నీ కజకిస్తాన్‌లో కనువిందు చేస్తాయి...
అల్మాటీ అంటే కజకిస్తాన్‌కు గుండెకాయ లాంటి సిటీ. చుట్టూ టియాన్ షాన్ పర్వతాలు, మధ్యలో ఆధునిక జీవనం. ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. కాక్–తోబే కొండ పైన నిలబడి నగరాన్ని చూస్తుంటే, మనం మేఘాల పైన ఉన్నామా అని అనిపిస్తుంది. బిగ్ అల్మాటీ లేక్, దాని నీలి నీరు చూస్తుంటే కళ్లు చెదిరిపోతాయి. అక్కడ నీటి రంగు, ఆకాశపు హంగు కలిసి వినూత్నమైన వ్యూని అందిస్తాయి.
రాజధాని అస్తానాను 2019–2022 మధ్య నూర్–సుల్తాన్ అని పిలిచారు, ఇప్పుడు తిరిగి అస్తానా అనే అంటున్నారు. ఇక్కడ ప్రతి కట్టడం ఒక ఫ్యూచర్ డ్రీమ్ లా కనిపిస్తుంది. బైటెరెక్ టవర్ పైన నిలబడి చూస్తుంటే, మొత్తం నగరం ఒక వెలుగుల సముద్రంలా కనిపిస్తుంది.
చారిన్ కాన్యన్ దగ్గర ప్రకృతి చాలా ఓపికగా చెక్కిన శిల్పంలాంటి ప్రకృతిని చూడవచ్చు. ఎర్ర రాతిని అందంగా చూపించేందుకు సూర్యకిరణాలు చేసే ప్రయత్నం వల్ల అక్కడి లోయలు బంగారంలా మెరుస్తాయి.
కైండీ లేక్ లో మునిగిపోయిన అడవిని లైఫ్ లో ఒక్కసారి అయినా చూడాలి. నీటి లోపల నుంచి పైకి వచ్చిన చెట్లు చూడటానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ అందాలు చూస్తూ నడుస్తుంటే ఇక్కడి కథలో మనం కూడా భాగమైనట్టు అనిపిస్తుంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి కజకిస్తాన్ ప్రయాణం ఒక అందమైన అనుభవంగా మొదలవుతుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అల్మాటీకి ప్రస్తుతానికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, ఢిల్లీ, దుబాయ్ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. విమానం పైకి లేవగానే, మనం ఒక కొత్త ప్రపంచానికి వెళ్తున్నామని మనసు చెప్పకనే చెబుతుంది.
విజయవాడ నుంచి వచ్చే ప్రయాణికులు ముందు హైదరాబాద్ కి వచ్చి అక్కడ నుంచి అల్మాటీకి వెళ్లవచ్చు. ఢిల్లీ నుంచి వెళ్లాలనుకుంటే డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లి అల్మాటీ ఫ్లైట్ క్యాచ్ చేసుకోవచ్చు. వాయుమార్గంలో కనిపించే మేఘాలు, అందమైన పర్వతాల వరుసలు, ఈ ప్రయాణాన్నే ఒక చక్కటి జ్ఞాపకంగా మారుస్తాయి.
అల్మాటీలో దిగగానే, చల్లటి గాలి మనల్ని వెల్ కమ్ అని పలకరిస్తుంది. ఎయిర్ పోర్ట్ నుంచి నగరంలోకి వెళ్లే దారిలో విస్తరించిన రోడ్లు, రెండు వైపులా ఉన్న పాప్లర్ చెట్లు మనకు స్వాగతం పలుకుతాయి. ప్రయాణం అంతా హాయిగా, ఒక సంగీతంలా సాగిపోతుంది, అలసట అనిపించదు.

ఎక్కడ ఉండాలి?
కజకిస్తాన్ లో స్టే చేయడం కూడా ఒక ఎక్స్ పీరియెన్సే. అల్మాటీలో ఉన్న బోటిక్ హోటల్స్ చాలా అందంగా ఉంటాయి. చెక్కతో, రాతితో చేసిన ఇంటీరియర్స్ లో గుండెను హత్తుకునే వెచ్చదనం ఉంటుంది. ఉదయం లేవగానే కిటికీ నుంచి కనిపించే మంచు కొండ దశ్యం, మనసును ప్రశాంతంగా మారుస్తుంది.
అస్తానాలో గ్లాస్ తో కట్టిన మోడరన్ హోటల్స్ లో ఉంటే రాత్రి వేళలో మెరిసే దీపాల మధ్య ఒక కొత్త లోకంలో ఉన్నామనిపిస్తుంది. కొంతమంది సాధారణంగా స్టెప్పీప్రాంతంలో ఉన్న యుర్ట్స్ లో కూడా ఉంటారు. యుర్ట్ అంటే గొర్రె ఉన్ని, కలపతో నిర్మించిన చిన్న గూడు. లోపల కూర్చుని వేడి వేడి టీ లేదా పాలు తాగుతూ, బయట వీచే గాలి శబ్దాన్ని వింటూ ఉంటే, కజక్ జాతి జీవన విధానం ఎంత సింపుల్ గా ఉంటుందో, అంతే కఠినంగా ఉంటుందో కూడా అర్థమవుతుంది.
ఏం చూడాలి?
కజకిస్తాన్ ను కళ్లతో కాదు, మనసుతో చూడాలి. ఉదయం వేళలో స్టెప్పీ గడ్డి మీద పడిన మంచు బిందువులు సూర్యకాంతిలో వజ్రాల్లా మెరుస్తాయి. మధ్యాహ్నం వేళలో గుర్రాలు పరిగెడుతుంటే, దుమ్ము లేవగానే ఒక త్రీడీ చిత్రాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
సాయంకాలం అల్మాటీలో పాన్ ఫిలోవ్ పార్క్ లో నడుస్తుంటే, ప్రపంచంలోనే చెక్కతో నిర్మించిన రెండవ అతిపెద్ద చర్చి అయిన జెన్ కోవ్ కేథడ్రల్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ చర్చి నిర్మాణంలో ఒక్క మేకు కూడా వాడలేదట. అయినా వందల ఏళ్లుగా అలాగే నిలబడి ఉండటం విశేషం. ఈ చర్చిలో కూర్చుని గుడి గంటల శబ్దం వింటుంటే, మనసు మరో లోకంలోకి వెళ్లిపోతుంది.
అస్తానాలో ఇషిమ్ నది ఒడ్డున నడుస్తుంటే, నీటి మీద పడుతున్న నగర దీపాల ప్రతిబింబాలు ఒక ఆర్ట్ లా అనిపిస్తాయి. ఇక్కడ ప్రతి దృశ్యం మనతో మాట్లాడుతుంది. మనల్ని ఆపేస్తుంది.

గుండెలో నిలిచే అనుభవాలు..
కజకిస్తాన్ వస్తే చెక్ లిస్ట్ పెట్టుకుని ప్రయాణం చేయడం కన్నా... ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసేలా ΄్లాన్ చేసుకోండి. మార్నింగ్ సమయంలో అల్మాటీ రివర్ వద్ద గడపడం ఒక మెమరీగా మిగిలిపోతుంది.
చారిన్ కాన్యన్‌లో సూర్యోదయం చూడటాన్ని మిస్ అవ్వకండి. ఎర్ర రాతి గోడపై సూర్య కిరణాలు పడగానే ఆ ప్రదేశం మొత్తం బంగారు రంగులో మెరిసిపోతుంది. అల్మాటీలో గ్రీన్ బజార్ లో తిరుగుతూ, లోకల్ ప్రజలతో మాటలు కలపడం, వాళ్లను నిండు మనసుతో నవ్వుతూ పలకరించడం ఇవే అసలైన ట్రావెలింగ్ ఎక్స్ పీరియెన్స్ అంటే.
శింబులాక్ లో రోప్ వేలో పైకి వెళ్లడం, మంచు పర్వతాల మధ్య గాలిలో తేలిపోవడం, నాలుగవ అనుభవంగా మిగిలిపోతుంది. చివరిగా అస్తానాలో బైటెరెక్ టవర్ పై చేయి పెట్టి కోరికలు కోరుకోవడాన్ని మిస్ చేయకండి. ఇలా చేయడం వల్ల ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని స్థానికులు నమ్ముతారు.
ఆసక్తికరమైన విషయాలు..
కజకిస్తాన్ ప్రపంచంలో తొమ్మిదవ పెద్ద దేశం. కానీ జనసాంద్రత చాలా తక్కువ. అందుకే ఇక్కడ ప్రకతి చాలా స్వచ్ఛంగా ఉంటుంది.
అల్మాటీకి యాపిల్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడే యాపిల్స్ పుట్టాయని చరిత్ర చెబుతుంది.
ఇక్కడ వింటర్ లో ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల వరకు పడిపోతుంది. సమ్మర్ లో మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
కజక్ ప్రజలు గుర్రాలను చాలా గౌరవిస్తారు, గుర్రం అంటే వాళ్లకు స్వాతంత్య్రానికి గుర్తు.
అస్తానా నగరం 1997 వరకు చిన్న ఊరుగా ఉండేది. ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది.

ఏం తినాలి?
కజకిస్తాన్ ఫుడ్ లో నాన్–వెజ్ వెరైటీలు ఎక్కువగా ఉంటాయి. బెష్ బర్మాక్ ఇక్కడ జాతీయ ఆహారం. మెత్తగా ఉడికిన మాంసం, విశాలమైన మైదా పూరీ లాంటి చపాతీ మీద వేసి ఇస్తారు. మీరు వెజిటేరియన్ అయితే ఇంగ్రీడియెంట్స్ గురించి తెలుసుకుని తినడం మంచిది.
కుమిస్ అంటే గుర్రం పాలతో చేసిన కొంచెం పులుపుగా ఉండే డ్రింక్. ముందు కాస్త వింతగా అనిపించినా, తర్వాత తర్వాత దాని రుచి అలవాటు అవుతుంది. అల్మాటీ బజార్ లో తిరుగుతుంటే, ప్రతి మూలా సమ్సా అనే నాన్–వెజ్ స్టఫ్ చేసిన స్నాక్ దొరుకుతుంది. దీనిని బన్ లోపల మాంసం, ఉల్లిపాయలు పెట్టి కాలుస్తారు. చాలా రుచిగా ఉంటుంది అని చెబుతారు. బౌర్ సాక్స్ అనే చిన్న పూరీలు కూడా ట్రై చేయవచ్చు. వేడి వేడిగా తింటుంటే, ఆ రోజు అలసట అంతా మర్చిపోతాం.

యాత్ర, బడ్జెట్ వివరాలు..
కజకిస్తాన్ కి వెళ్లడానికి ఇండియన్ పాస్ పోర్ట్ ఉన్నవారికి ఈ–వీసా అవసరం. ఆన్ లైన్ లో అప్లై చేస్తే 3–5 రోజుల్లో వచ్చేస్తుంది.ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది.
హైదరాబాద్ నుంచి 5 రోజుల యాత్ర బడ్జెట్ ను ఒక ఐడియా కోసం మీకు వివరిస్తాను. అయితే ఇది ఫైనల్ బడ్జెట్ కాదు. మీ ట్రావెల్ స్టైల్, సీజన్ వంటి అనేక కారణాలు మీ బడ్జెట్ ను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి.
ఇక బడ్జెట్ ట్రిప్ ΄్లాన్ చేస్తే వన్ వే టికెట్ మీకు రూ. 25 వేల నుంచి 35 వేల వరకు రిటర్న్ రూ. 56 వేల నుంచి 72 వేల వరకు లభిస్తుంది. కజకిస్తాన్ లో మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి రూమ్ రెంటు మారుతుంది. రూ. 3,500 నుంచి రూ. 15 వేల వరకు రేంజ్ లో మీకు కంఫర్ట్ గా ఉన్న రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
రోజు భోజనానికి రూ. 1,500 నుంచి 2,500 అయితే సరిపోతుంది. అల్మాటీ నుంచి అస్తానాకి ట్రైన్ లేక డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఖర్చు తక్కువ, ఎక్కువ మెమరీస్ లభిస్తాయి.
– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
ఇదీ చదవండి: అక్కడ వరుడే అత్తారింటికి వెళ్తాడు..!


