పదేపదే కోరినా మమతా బెనర్జీ ప్రభుత్వం ఇవ్వలేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం
సిలిగురి: సరిహద్దులు సురక్షితం కానంత వరకు రాష్ట్రం గానీ, దేశం గానీ సురక్షితంగా ఉండవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి భూమిని కేటాయించాలంటూ తాను పదేపదే విజ్ఞప్తి చేసినా బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయన వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. సశస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ) కార్యాలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌బీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి 1,129 ఎకరాల భూమిని కేటాయించాలని 2014 నుంచే కోరుతూ వచ్చానని తెలిపారు. కానీ, మమతా బెనర్జీ పాలనలో తన వినతిని తిరస్కరించారని ఆక్షేపించారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఆ భూమి లభించిందని స్పష్టంచేశారు. రాష్ట్రానికి చెందిన గత ముఖ్యమంత్రులెవరూ ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్ కార్యక్రమాలకు ఎన్నడూ హాజరుకాలేదని గుర్తుచేశారు.
వేదికపై తన పక్కనున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారని ప్రశంసించారు. ఎస్‌ఎస్‌బీ అనేది రాజకీయ సంస్థ కాదని పేర్కొన్నారు. దేశ సరిహద్దులను కాపాడేవారి పట్ల ఉదాసీనత ప్రదర్శించడం తప్పుడు సంకేతాలను ఇస్తుందని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో సువేందు అధికారి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి అవసరమైనవన్నీ లభించాయని చెప్పారు.
ఇప్పుడు అధికారిక లేఖలు పంపకముందే ప్రాజెక్టులకు రాష్ట్రం నుంచి ఆమోదాలు లభిస్తున్నాయని తెలిపారు. ఉత్తర బెంగాల్‌లోని సిలిగురిలో 80 ఎకరాల స్థలంలో సరిహద్దు భద్రతా యంత్రాంగ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు అమిత్ షా ప్రకటించారు. సిలిగురిలో మూడు క్రిమినల్ చట్టాలపై ఒక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. దేశమంతటా కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడం ప్రారంభించినప్పటికీ, బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం వాటిని ఎన్నడూ నోటిఫై చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌లో చట్టబద్ధ పాలనను తీసుకొచి్చందని స్పష్టంచేశారు.


