న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి కారణమైన ఓ ఫేక్ వీడియో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళా నిరసనకారులను యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారి అనుచితంగా తాకుతున్నట్లు కనిపించే వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హర్యారాలోని పల్వాల్‌కు చెందిన 24 ఏళ్ల నదీమ్ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నదీమ్ అహ్మద్ తనను తాను ‘స్వతంత్ర జర్నలిస్టు’గా పేర్కొంటూ ‘న్యూస్ ఐనా’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. పోలీసుల ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో ఏఐ టూల్స్ ఉపయోగించి వీడియోను రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో రీల్స్ రూపంలో ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు.
జంతర్‌మంతర్ వద్ద మహిళా నిరసనకారులతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లు చూపించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని అక్టోబర్ 3న గుర్తించినట్లు అదనపు డీసీపీ మన్‌జీత్ తెలిపారు. అవి సీసీటీవీ దృశ్యాలుగా ప్రచారం అవుతున్నాయని, అయితే పరిశీలనలో అవి నిజమైనవి కావని గుర్తించినట్లు చెప్పారు. వీడియోలను ఏఐ ద్వారా రూపొందించినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. వైరల్ అవుతున్న వీడియోపై ఢిల్లీ పోలీసుల సోషల్ మీడియా యూనిట్ దృష్టి సారించింది. యూనిఫాంలో ఉన్న పోలీసు సిబ్బంది మహిళతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు చూపించిన వీడియోకు సంబంధించిన ఛానల్‌ను పరిశీలించగా నదీమ్ అహ్మద్ గురించి సమాచారం లభించిందని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
వీడియోను తయారు చేయడం వెనుక పోలీసులపై ప్రజల్లో, ముఖ్యంగా నిరసనకారుల్లో వ్యతిరేక భావన పెంచే ఉద్దేశం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. తన వద్ద అనేక ఏఐ టూల్స్ ఉన్నాయని నదీమ్ విచారణలో చెప్పినట్లు అదనపు డీసీపీ మన్‌జీత్ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. నదీమ్ అహ్మద్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడి కార్యకలాపాలకు సంబంధించిన నిధుల మూలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అతడికి మరెవరైనా ఆర్థిక సహాయం చేశారా? వీడియో తయారీ, ప్రచారంలో ఇతరులు ఉన్నారా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: మీ దగ్గర 50 పైసల నాణేలున్నాయా?.. వెంటనే ఇలా చేయండి!


