శ్వేత ప్రియుడి ల్యాప్‌టాప్‌లో.. | Bangalore Swetha Case: Shocking Facts In The Charge Sheet | Sakshi
Sakshi News home page

శ్వేత ప్రియుడి ల్యాప్‌టాప్‌లో..

Oct 6 2026 2:02 PM | Updated on Oct 6 2026 2:28 PM

Bangalore Swetha Case: Shocking Facts In The Charge Sheet

బెంగళూరులో సంచలనం సృష్టించిన ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుల వ్యవహారం కారణంగా శ్వేత తల్లిదండ్రులు, సోదరిని హత్య చేసినట్లు అభియోగం ఎదుర్కొంటున్న ఆమె లివ్‌-ఇన్‌ పార్ట్‌నర్‌ జె. కెన్నెత్‌ ల్యాప్‌టాప్‌లో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. హత్యలకు ముందు అతడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ఆశ్రయించి.. మనుషులపై దాడి చేయడం, వారిని ఎలా అదుపులోకి తీసుకోవడం వంటి అంశాలపై వరుస ప్రశ్నలు అడిగినట్లు 2,085 పేజీల చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

బెంగళూరులోని కేఆర్‌ పురం సీగేహళ్లిలో జూన్‌ 22న ఈ ఘటన చోటుచేసుకుంది. చార్జ్‌షీట్‌ ప్రకారం.. టెకీ అయిన శ్వేత తన లివ్‌-ఇన్‌ పార్ట్‌నర్‌ కెన్నెత్‌ కోసం ఏడాదిలోనే సుమారు రూ.52 లక్షల వరకు అప్పులు చేసింది. ఇందులో రూ.30 లక్షల బిజినెస్‌ లోన్‌, రెండు బ్యాంకుల నుంచి రూ.8 లక్షలు, రూ.6 లక్షల వ్యక్తిగత రుణాలు ఉన్నాయి. మరో రూ.8 లక్షలను స్నేహితులు, బంధువులు, క్లాస్‌మేట్స్‌, సహోద్యోగుల నుంచి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అప్పుల చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో బ్యాంకు అధికారులు శ్వేత తల్లిదండ్రుల ఇంటికి నోటీసులు పంపారు. దీంతో తల్లిదండ్రులకు తమ కుమార్తె ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన విషయం తెలిసింది. ఆ డబ్బంతా కెన్నెత్‌ కోసం తీసుకున్నట్లు తెలుసుకుని వారు శ్వేతను ప్రశ్నించారు. శ్వేత తండ్రి సోమసుందర్‌ కూడా కెన్నెత్‌ను నిలదీశారు. డబ్బంతా ఏం చేశావని.. అప్పుల నోటీసులు తమ ఇంటికి ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ వివాదం చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. 

సీగేహళ్లిలోని సాయి గ్రీన్‌ అపార్ట్‌మెంట్‌లో ఆ రాత్రి సోమసుందర్‌ (55), ఆయన భార్య ముత్తులక్ష్మి (50), కుమార్తె సుప్రియ (20)పై కెన్నెత్‌ దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సోమసుందర్‌ అపార్ట్‌మెంట్‌ బయటకు వచ్చి మెట్ల వద్దకు చేరుకున్నారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులకు తన భార్య, కుమార్తెపై కెన్నెత్‌ దాడి చేస్తున్నాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంట్లో ముత్తులక్ష్మి, సుప్రియ కూడా తీవ్ర గాయాలతో మృతిచెందారు. 

కేసు దర్యాప్తులో భాగంగా కెన్నెత్‌ ల్యాప్‌టాప్‌ను పరిశీలించిన ఫోరెన్సిక్‌ నిపుణులకు అతడి ఏఐ సెర్చ్‌లపై ఆసక్తికరమైన వివరాలు కనిపించాయి. హత్యలకు ముందు అతడు దాడులకు సంబంధించిన పలు అంశాలపై ఏఐని ప్రశ్నించినట్లు పోలీసులు గుర్తించారు. కిచెన్‌ కత్తితో మనుషులను ప్రాణాంతకంగా ఎలా గాయపరచవచ్చు? వెనిగర్‌, కారం పొడి, కారం పేస్ట్‌తో ఒకరిని ఎలా అంధుడిని చేయవచ్చు? ముగ్గురి మోకాళ్లను ఎలా విరగ్గొట్టవచ్చు? ఏకాంత ప్రదేశంలో ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దొంగలను ఎలా ఎదుర్కోవచ్చు? వంటి ప్రశ్నలను అతడు ఏఐని అడిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇంతటితో ఆగకుండా.. చరిత్రలో మనుషులను చంపేందుకు ఉపయోగించిన అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాల గురించి కూడా కెన్నెత్‌ ఏఐని ప్రశ్నించినట్లు చార్జ్‌షీట్‌లో వెల్లడైంది. మరో వైపు, బ్యాంకుల నుంచి వస్తున్న రుణ చెల్లింపు ఫోన్‌కాల్స్‌ను ఎలా ఎదుర్కోవాలి? స్నేహితుడి రుణానికి సంబంధించిన సమస్య నుంచి ఎలా బయటపడాలి? దివాలా ఎలా ప్రకటించాలి? వంటి ఆర్థిక అంశాలపై కూడా అతడు ఏఐని ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏఐ నుంచి కెన్నెత్‌కు ఎలాంటి సమాధానాలు వచ్చాయన్నది ఇంకా పోలీసులు నిర్ధారించలేకపోయారు. ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ పరిశీలిస్తున్న సమయంలో గూగుల్‌లో కనిపించిన డ్రాప్‌డౌన్‌ సెర్చ్‌ సూచనల ఆధారంగా ఈ ప్రశ్నలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

కెన్నెత్‌ తరచూ ఏఐతో సంభాషించేవాడని, దాన్ని ఒక స్నేహితుడిలా భావించేవాడని నివేదిక పేర్కొంది. అయితే హత్యకు పాల్పడితే ఎలాంటి శిక్ష పడుతుందన్న విషయాన్ని మాత్రం అతడు ఏఐని అడగలేదని పోలీసులు తెలిపారు. అలాగే తన ఆర్థిక పరిస్థితిని ప్రశ్నిస్తున్న వారిని చంపడం సరైందేనా అని కూడా అడిగిన ఆధారాలు లేవన్నారు.

ఇదీ చదవండి: లంచం తీసుకోవడంలో ఈమె స్టయిల్‌ డిఫరెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement