breaking news
charge sheet feilds
-
శ్వేత ప్రియుడి ల్యాప్‌టాప్‌లో..
బెంగళూరులో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుల వ్యవహారం కారణంగా శ్వేత తల్లిదండ్రులు, సోదరిని హత్య చేసినట్లు అభియోగం ఎదుర్కొంటున్న ఆమె లివ్-ఇన్ పార్ట్నర్ జె. కెన్నెత్ ల్యాప్‌టాప్‌లో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. హత్యలకు ముందు అతడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఆశ్రయించి.. మనుషులపై దాడి చేయడం, వారిని ఎలా అదుపులోకి తీసుకోవడం వంటి అంశాలపై వరుస ప్రశ్నలు అడిగినట్లు 2,085 పేజీల చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.బెంగళూరులోని కేఆర్ పురం సీగేహళ్లిలో జూన్ 22న ఈ ఘటన చోటుచేసుకుంది. చార్జ్‌షీట్ ప్రకారం.. టెకీ అయిన శ్వేత తన లివ్-ఇన్ పార్ట్నర్ కెన్నెత్ కోసం ఏడాదిలోనే సుమారు రూ.52 లక్షల వరకు అప్పులు చేసింది. ఇందులో రూ.30 లక్షల బిజినెస్ లోన్, రెండు బ్యాంకుల నుంచి రూ.8 లక్షలు, రూ.6 లక్షల వ్యక్తిగత రుణాలు ఉన్నాయి. మరో రూ.8 లక్షలను స్నేహితులు, బంధువులు, క్లాస్మేట్స్, సహోద్యోగుల నుంచి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అప్పుల చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో బ్యాంకు అధికారులు శ్వేత తల్లిదండ్రుల ఇంటికి నోటీసులు పంపారు. దీంతో తల్లిదండ్రులకు తమ కుమార్తె ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన విషయం తెలిసింది. ఆ డబ్బంతా కెన్నెత్ కోసం తీసుకున్నట్లు తెలుసుకుని వారు శ్వేతను ప్రశ్నించారు. శ్వేత తండ్రి సోమసుందర్ కూడా కెన్నెత్‌ను నిలదీశారు. డబ్బంతా ఏం చేశావని.. అప్పుల నోటీసులు తమ ఇంటికి ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ వివాదం చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. సీగేహళ్లిలోని సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో ఆ రాత్రి సోమసుందర్ (55), ఆయన భార్య ముత్తులక్ష్మి (50), కుమార్తె సుప్రియ (20)పై కెన్నెత్ దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సోమసుందర్ అపార్ట్మెంట్ బయటకు వచ్చి మెట్ల వద్దకు చేరుకున్నారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులకు తన భార్య, కుమార్తెపై కెన్నెత్ దాడి చేస్తున్నాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంట్లో ముత్తులక్ష్మి, సుప్రియ కూడా తీవ్ర గాయాలతో మృతిచెందారు. కేసు దర్యాప్తులో భాగంగా కెన్నెత్ ల్యాప్‌టాప్‌ను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులకు అతడి ఏఐ సెర్చ్‌లపై ఆసక్తికరమైన వివరాలు కనిపించాయి. హత్యలకు ముందు అతడు దాడులకు సంబంధించిన పలు అంశాలపై ఏఐని ప్రశ్నించినట్లు పోలీసులు గుర్తించారు. కిచెన్ కత్తితో మనుషులను ప్రాణాంతకంగా ఎలా గాయపరచవచ్చు? వెనిగర్, కారం పొడి, కారం పేస్ట్‌తో ఒకరిని ఎలా అంధుడిని చేయవచ్చు? ముగ్గురి మోకాళ్లను ఎలా విరగ్గొట్టవచ్చు? ఏకాంత ప్రదేశంలో ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దొంగలను ఎలా ఎదుర్కోవచ్చు? వంటి ప్రశ్నలను అతడు ఏఐని అడిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇంతటితో ఆగకుండా.. చరిత్రలో మనుషులను చంపేందుకు ఉపయోగించిన అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాల గురించి కూడా కెన్నెత్ ఏఐని ప్రశ్నించినట్లు చార్జ్‌షీట్‌లో వెల్లడైంది. మరో వైపు, బ్యాంకుల నుంచి వస్తున్న రుణ చెల్లింపు ఫోన్‌కాల్స్‌ను ఎలా ఎదుర్కోవాలి? స్నేహితుడి రుణానికి సంబంధించిన సమస్య నుంచి ఎలా బయటపడాలి? దివాలా ఎలా ప్రకటించాలి? వంటి ఆర్థిక అంశాలపై కూడా అతడు ఏఐని ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏఐ నుంచి కెన్నెత్‌కు ఎలాంటి సమాధానాలు వచ్చాయన్నది ఇంకా పోలీసులు నిర్ధారించలేకపోయారు. ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరిశీలిస్తున్న సమయంలో గూగుల్‌లో కనిపించిన డ్రాప్‌డౌన్ సెర్చ్ సూచనల ఆధారంగా ఈ ప్రశ్నలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.కెన్నెత్ తరచూ ఏఐతో సంభాషించేవాడని, దాన్ని ఒక స్నేహితుడిలా భావించేవాడని నివేదిక పేర్కొంది. అయితే హత్యకు పాల్పడితే ఎలాంటి శిక్ష పడుతుందన్న విషయాన్ని మాత్రం అతడు ఏఐని అడగలేదని పోలీసులు తెలిపారు. అలాగే తన ఆర్థిక పరిస్థితిని ప్రశ్నిస్తున్న వారిని చంపడం సరైందేనా అని కూడా అడిగిన ఆధారాలు లేవన్నారు.ఇదీ చదవండి: లంచం తీసుకోవడంలో ఈమె స్టయిల్ డిఫరెంట్ -
లారెన్స్ బిష్ణోయ్‌పై అమెరికా ఛార్జ్ షీట్ దాఖలు
వాషింగ్టన్: భారత్ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని ఆరుగురు సహచరులపై అమెరికా న్యాయ శాఖ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అందులో హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్,మానవ అక్రమ రవాణా వంటి అనేక అంతర్జాతీయ నేరాలకు పాల్పడ్డారనే వివరాలను అధికారులు పొందుపరిచారు.లారెన్స్ బిష్ణోయ్ 2015 నుండి భారత్‌లో జైలు శిక్షను అనుభవిస్తున్నప్పటికీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(VoIP) సాంకేతికత ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తన నేర నెట్‌వర్క్‌ను నేరుగా నడుపుతున్నట్లు అమెరికా దర్యాప్తులో స్పష్టమైంది.అమెరికా ఛార్జ్‌షీట్ వివరాల ప్రకారం, లారెన్స్ బిష్ణోయ్ మరియు ఉత్తర అమెరికాలో ఉన్న అతని ప్రధాన అనుచరుడు గోల్డీ బ్రార్ కలిసి 18 జూన్ 2023న కెనడాలోని సర్రేలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ను మే 2022లో పంజాబ్‌లో దారుణంగా కాల్చి చంపిన ఘటనకు బిష్ణోయ్ గ్యాంగే పూర్తి బాధ్యత వహించినట్లు తెలిపింది.దీంతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపాలనే ఉద్దేశాన్ని బిష్ణోయ్ పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచాడు. ఏప్రిల్ 2024లో ముంబైలోని నటుడి నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు కూడా ఈ సిండికేట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇలా లారెన్స్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని భారత్ నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్ వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలకు విస్తరించాయి.ప్రస్తుతం ఈ గ్యాంగ్‌లో గోల్డీ బ్రార్ ఉత్తర అమెరికా విభాగాన్ని, రోహిత్ గొదారా యూరప్ విభాగాన్ని, సుఖ్రాజ్ సింగ్ కాంగ్ భారతదేశ కార్యకలాపాలను లీడ్ చేస్తున్నారు. అమెరికా దాఖలు చేసిన ఈ ఛార్జ్‌షీట్ కారణంగా గ్లోబల్ స్థాయిలో లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్‌పై చట్టపరమైన నిఘా మరియు చర్యలు మరింత కఠినతరం కానున్నాయి. -
లైంగిక వేధింపుల కేసు : యడ్యూరప్పకు ఎదురు దెబ్బ!
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కర్ణాటక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) విభాగం యడ్యూరప్ప వేధించారంటూ మైనర్‌ను ఆయనకు వ్యతిరేకంగా ఫోక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 8 కింద ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ చట్ట ప్రకారం..యడ్యూరప్ప నేరం చేసినట్లు నిరూపితమైతే ఆయనకు మూడు లేదా ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం కర్ణాటక హైకోర్టులో యడ్యూరప్ప బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకరోజు ముందు అంటే ఇవాళ ఆయనపై సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. యడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసుఓ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు (మైనర్), ఆమె తల్లి ఫిబ్రవరిలో యడ్యూరప్పను సంపద్రించారు.ఆ సమయంలో యడ్యూరప్ప తన కూతురును లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలతో మార్చి 14న బెంగళూరులోని సదాశివనగర్‌లో పోలీస్‌స్టేషన్‌లో మాజీ ముఖ్యమంత్రిపై పోలీసు కేసు నమోదైంది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదైన కొద్ది గంటల్లో డీజీపీ అలోక్ మోహన్ కేసును దర్యాప్తు చేసేందుకు సీడీఐకి బదిలీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 కింద బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది.బాధితురాలి తల్లి మృతి.. కీలక మలుపు తిరిగిన కేసుకేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలి తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సీఐడీ సైతం ఈ కేసులో దూకుడు పెంచింది. మరోవైపు కర్ణాటక హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది.ఆయన మాజీ సీఎం తొందరపడొద్దుజూన్ 14 న జరిగిన చివరి విచారణలో యడ్యురప్ప మాజీ ముఖ్యమంత్రి. ఈ కేసు చాలా కీలమైంది. తొందరపడి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎస్ కృష్ణ దీక్షిత్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అదుపులోకి తీసుకోవద్దని స్పష్టంచేసింది. అదే సమయంలో.. విచారణకు గైర్హాజరుకాకూడదని యడియూరప్పకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే ఆయన సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు వేగంగా సాగడం లేదని ఆరోపిస్తూ మైనర్ కుటుంబం కోర్టులోపిటిషన్ దాఖలు చేయగా, ముందస్తు బెయిల్ కోరుతూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసులు శుక్రవారం (ఏప్రిల్ 26) ఒకేసారి విచారణకు రానున్నాయి.ఎక్కడ విచారించాలోఒకరోజు ముందే యడ్యురప్పపై సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో బెంగళూరులోని ప్రత్యేక పోక్సో కోర్టులో యడ్యూరప్ప విచారణను ఎదుర్కోనున్నారు. విచారణ పోక్సో కోర్టులో జరగాలా లేక ఎంపీ/ఎమ్మెల్యేల కోసం నియమించబడిన ప్రత్యేక కోర్టులో జరగాలా అనే దానిపై కొంత గందరగోళం నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పాలెం దుర్ఘటనపై చార్జిషీటు
- వోల్వో బస్సు దగ్ధం కేసులో 10 మందిపై అభియోగం - ప్రమాదానికి కారణాలపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జాతీయ రహదారిపై వోల్వో బస్సు దగ్ధమై మొత్తం 45 మంది సజీవదహనమైన కేసులో సీఐడీ అధికారులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 2013 అక్టోబర్ 30న జరిగిన ఈ ఘోర సంఘటనకు సంబంధించి పది మంది నిందితులను అరెస్టు చేశారు. సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తూ మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద కల్వర్టును ఢీకొని దగ్ధమైంది. ఈ కేసును సీఐడీ విభాగం అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపింది. జాతీయ రహదారిలో ఏవైనా లోపాలున్నాయా? బస్సు డిజైన్‌లో లోపాలున్నాయా? అన్న అంశాలను పరిశీలించారు. పాలెం వద్ద బస్సు స్పీడ్‌గా వచ్చి కల్వర్టును ఢీకొనడం వల్ల.. అక్కడ లేచిన మంటలు బస్సు ముందు టైర్ల వెనక ఉన్న ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంకులకు అంటుకోవడంతో బస్సు కాలిందని విచారణలో తేల్చారు. ఈ సమయంలో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బస్సు అద్దాలను పగులగొట్టేందుకు అవసరమైన సుత్తి లాంటి అత్యవసర పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణమైందని దర్యాప్తులో తేల్చారు. ఘటనకు బాధ్యులుగా తేలిన జబ్బార్ ట్రావెల్స్ యాజమానులు షకీల్ జబ్బార్, అతని సోదరుడు, డ్రైవర్ ఫెరోజ్‌పాషా, క్లీనర్ అయాజ్‌పాషాలతో పాటు ఇతర సిబ్బందిని అరెస్టు చేశారు. ఈ బస్సును జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకు ఇచ్చిన జేసీ దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య ఉమారెడ్డిని కూడా అరెస్టు చేశారు. అలాగే, లాభాపేక్షలో నిర్వాహకులు బస్సులో ఉండాల్సిన 45 సీట్ల కంటే అధికంగా మరో ఐదు సీట్లను ఏర్పాటు చేసినట్లు కూడా తేలింది. బస్సులో మంటలు త్వరగా విస్తరించడానికి బస్సు ఫ్లోర్‌ను చెక్కతో పాటు రబ్బర్ మాటింగ్ చేయడం మరో కారణంగా తేల్చారు. జాతీయ రహదారిపై పాలెం వద్ద కల్వర్టు పారాపిట్ వాల్ రహదారిలోకి కొద్దిగా చొచ్చుకొని వచ్చేలా నిర్మించడం కూడా ప్రమాదానికి కారణమని కూడా సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇన్ని విధాలుగా కేసును దర్యాప్తు చేసిన తర్వాత పది మంది నిందితులను అరెస్టు చేసి, వారిపై పకడ్బందీగా చార్జిషీటు రూపొందించారు. దీనిని మే 7న మహబూబ్‌నగర్ కోర్టులో దాఖలు చేశామని సీఐడీ అదనపు డీజీ తెలిపారు. కేసుకు సంబంధించి అవసరమైన అనుబంధ పత్రాలను శనివారం కోర్టుకు అందజేసినట్లు వివరించారు. అంతేకాకుండా బస్సు దుర్ఘటనకు కారణమైన అంశాలను పేర్కొంటూ ప్రభుత్వానికి 400 పేజీల నివేదికను శనివారం అందజేసినట్లు వివంచారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తును సమగ్రంగా పూర్తి చేసిన సీఐడీ అధికారులను ఆయన అభినందనలు తెలిపారు.


