యెమెన్ తీరంలో హైజాక్ కలకలం | Armed men abandon hijacked cargo ship off Yemen coast | Sakshi
Sakshi News home page

యెమెన్ తీరంలో హైజాక్ కలకలం

Nov 29 2026 6:55 AM | Updated on Nov 29 2026 6:55 AM

Armed men abandon hijacked cargo ship off Yemen coast

సనా: సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో నౌక.. ఒక్కసారిగా సాయుధుల చేతికి చిక్కింది. నౌకలోకి చొరబడిన దుండగులు దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో సముద్ర మార్గంలో తీవ్ర కలకలం రేగింది. అయితే కొద్దిసేపటికే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నౌకను స్వాధీనం చేసుకున్న సాయుధులు దానిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో నవంబర్ 28న ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్హాఫ్‌కు నైరుతి దిశగా సుమారు 64 నాటికల్ మైళ్ల (119 కిలోమీటర్లు) దూరంలో కార్గో నౌకపై సాయుధులు దాడి చేశారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నౌకలోకి ప్రవేశించి స్వాధీనం చేసుకున్నట్లు కెప్టెన్ సమాచారం ఇచ్చారు. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) అప్రమత్తమైంది. సంబంధిత అధికారులకు సమాచారం అందించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.

అయితే నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్న సాయుధులు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, అది తదుపరి గమ్యస్థానానికి ప్రయాణం కొనసాగిస్తోందని యూకేఎంటీవో తాజా ప్రకటనలో వెల్లడించింది. ఈ పరిణామంతో తొలుత నెలకొన్న ఆందోళన తొలగింది. ఈ ప్రాంతంలో ప్రయాణించే ఇతర నౌకలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సంస్థ సూచించింది.

మరోవైపు హార్న్ ఆఫ్ ఆఫ్రికా పరిసరాల్లో గత ఏడాది కాలంగా సముద్రపు దొంగతనాల ఘటనలు పెరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఆసియా, ఐరోపా మధ్య వాణిజ్య రవాణాకు కీలకమైన గల్ఫ్ ఆఫ్ ఏడెన్.. బాబ్ ఎల్ మందెబ్ జలసంధి ద్వారా ఎర్ర సముద్రంతో అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇటీవలి నెలల్లో పలు వాణిజ్య నౌకలపై దాడులు, హైజాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అంతర్జాతీయ నౌకాయాన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: గోల్‌ కొట్టి గాయపడిన మమ్దానీ.. వెంటనే శస్త్రచికిత్స!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement