పెళ్లి మండపంపై వైమానిక దాడి.. 21 మంది దుర్మరణం | Myanmar Airstrikes And Dozens People No More | Sakshi
Sakshi News home page

Mayanmar: సైనిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలు

Nov 29 2026 4:24 AM | Updated on Nov 29 2026 4:24 AM

Myanmar Airstrikes And Dozens People No More

మయన్మార్‌లో సైనిక పాలకులు చేసిన వైమానిక దాడులు మరోసారి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు, సహాయక బృందాలు వెల్లడించాయి. ఈశాన్య ప్రాంతంలోని మో బై జిల్లాలో ఓ వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణంపై శనివారం జరిగిన దాడిలో ఐదుగురు చిన్నారులు సహా 21 మంది మరణించినట్లు స్థానిక సహాయక సంస్థ తెలిపింది. పశ్చిమ రఖైన్ రాష్ట్రంలో జరిగిన రెండో బాంబు దాడిలో తొమ్మిది మంది మరణించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.

గురువారం మధ్య మయన్మార్‌లో జరిగిన మరోదాడిలో 29 మంది మరణించినట్లు స్వయం ప్రకటిత నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (ఎన్‌యూజీ) తెలిపింది. 2021లో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వరుసగా చోటుచేసుకుంటున్న వైమానిక దాడులు భారీ ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి. ఈ ఘర్షణల్లో లక్ష మందికి పైగా మరణించినట్లు ఏసీఎల్‌ఈడీ అంచనా వేసింది.

మో బై పట్టణం ప్రస్తుతం సైనిక దళాల నియంత్రణలో ఉన్నప్పటికీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిపక్ష సాయుధ బలగాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతం షాన్, కరెన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటంతో పెద్ద సంఖ్యలో అంతర్గతంగా నిరాశ్రయులైన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వివాహ వేడుక ప్రాంగణంపై జరిగిన దాడి అనంతరం రక్తసిక్తమైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గురువారం మధ్య మయన్మార్‌లోని మగ్వే ప్రాంతంలో పాఠశాల, బౌద్ధ మఠాన్ని కేంద్రంగా చేసుకుని బాంబులు, ఫిరంగులు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు ఎన్‌యూజీ ఆరోపించింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 20 మంది సాధారణ పౌరులు, మరో తొమ్మిది మంది పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ సభ్యులు మరణించినట్లు తెలిపింది. వరుస దాడులతో మయన్మార్‌లో పౌరుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement