మీరు ఓ పార్క్‌లో కూర్చున్నారనుకుందాం. బాధ కలిగించే ఓ విషయం గుర్తురావడంతో బోరున ఏడ్చేశారు. ఇలాంటి టైంలో పక్కనున్నోళ్లు ఏం చేస్తారు? కుదిరితే దగ్గరకొచ్చి ఓదార్చుతారు. లేదంటే మన మానాన మనల్ని వదిలేస్తారు. కానీ హనా అనే మహిళకు మాత్రం మున్సిపల్ అధికారులు వచ్చి రూ.2600 జరిమానా విధించారు. ఇంతకీ ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగింది?
సిరియా మూలాలున్న హనా.. జర్మనీలో కెమిస్ట్రీ చదువుతోంది. రీసెంట్‌గా గెల్సెన్‌కిర్చెన్ అనే ఊరిలోని ఓ పిల్లల పార్క్‌లో నడుచుకుంటూ వెళ్తూ అక్కడే ఉన్న ఓ బెంచ్‌పై ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. తన ఆంటీకి ఫోన్ చేసి తన బాధని పంచుకుని ఏడ్చేసింది. ఇదంతా గమనించిన ముగ్గురు మున్సిపల్ అధికారులు ఈమె దగ్గరకొచ్చి అక్కడ ఊయల ఊగుతున్న ఇద్దరు పిల్లలు మీ పిల్లలా అని అడిగారు. హనా కాదని చెప్పడంతో అధికారులు ఆమె గుర్తింపు కార్డు తీసుకుని భారత కరెన్సీ ప్రకారం రూ.2600 జరిమానా విధించారు.
పిల్లలు లేకుండా పిల్లల పార్క్‌లో కూర్చోవడమే హనా చేసిన తప్పు. గెల్సెన్‌కిర్చెన్ మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం పిల్లల ఆటస్థలంలో 14 ఏళ్ల లోపు పిల్లలు, వారిని తీసుకువచ్చిన పెద్దలు మాత్రమే ఉండాలి. పిల్లలు లేని పెద్దలకు అక్కడ ప్రవేశం లేదు. ఇది పిల్లల భద్రత కోసం పెట్టిన నిబంధన. పిల్లల పార్కుల్లో అనుమానాస్పద వ్యక్తులు తిరగకుండా చూడటం చాలా అవసరం. అందుకే ఈ నిబంధన పెట్టారు.


