మరిన్ని అణ్వాయుధాలు  | Kim Jong Un inspecting North Korean nuclear facilities | Sakshi
Sakshi News home page

మరిన్ని అణ్వాయుధాలు 

Nov 27 2026 6:18 AM | Updated on Nov 27 2026 6:18 AM

Kim Jong Un inspecting North Korean nuclear facilities

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పిలుపు 

ట్రంప్‌ పిలుపు బేఖాతరు 

అణుపదార్థ ఫ్యాక్టరీల తనిఖీ 

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన జోరు మరింత పెంచారు. ఆసియా పర్యటన సందర్భంగా సమావేశమవుదామన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌ పిలుపును బేఖాతరు చేయడమే కాకుండా ఉత్తర కొరియా మరిన్ని అణ్వాయుధాలు తయారు చేసుకోవాలని పిలుపునివ్వడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. చర్చలకు ట్రంప్‌ పిలుపు ఇచ్చిన కొన్ని రోజులకే కిమ్‌ అణు పదార్థాల ఫ్యాక్టరీలను సందర్శించి మరిన్ని అణ్వాయుధాలను తయారు చేయాలనడం గమనార్హం. 

కిమ్‌ మొత్తం రెండు అణు పదార్థాల ఉత్పత్తి కేంద్రాలను తనిఖీ చేసినట్లు ఉ.కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్‌ఏ గురువారం తెలిపింది. యురేనియం శుదీ్ధకరణకు వాడే సెంట్రీఫ్యూజ్‌లు, అణ్వాయుధాల గోడౌన్లలో కిమ్, ఇతర సీనియర్‌ అధికారులు నడుస్తున్నట్టుగా చూపే ఫొటోలను విడుదల చేసింది. వీటిల్లో కొన్నింటిని బ్లర్‌ చేసి ఉంచారు. కిమ్‌ బుధవారం ఒక అణు పరిశోధన సంస్థను కూడా సందర్శించినట్లు తెలిపింది. 

కిమ్‌ సందర్శించిన కేంద్రాలు ఎక్కడున్నాయో మాత్రం కేసీఎన్‌ఏ స్పష్టం చేయలేదు. ఉత్తర కొరియా 2010లో అమెరికన్‌ నిపుణుల బృందానికి యోంగ్‌బ్యోన్‌ అణు సముదాయంలోని యురేనియం శుద్ధి కేంద్రాన్ని చూపించింది. ఆ తరువాత కూడా చాలాసార్లు అలాంటి కేంద్రాలను బహిరంగంగానే చూపింది. కానీ తాజా పర్యటన జరిగిన చోటును మాత్రం చూపలేదు. అయితే.. ఇవి కూడా యోంగ్‌బ్యోన్‌లోనివే కావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

అమెరికా, దక్షిణ కొరియాలతో ముప్పు.... 
కొరియా ద్వీపకల్పానికి ముప్పు ముంచుకొస్తోందని, అందుకే తాను రక్షణను పటిష్టం చేసుకునేందుకు అణు పదార్థ తయారీ కేంద్రాలను సందర్శించినట్లు కిమ్‌ ప్రకటించారు. అణుశక్తితో నడిచే జలాంతర్గాములను కూడా సమకూర్చుకొమ్మని అమెరికా ఈ ప్రాంతంలోని మిత్రదేశాలను ఉసికొల్పుతోందని, వారితో అణ్వాయుధాలు పంచుకుంటానని చెబుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే ఉ.కొరియా కూడా తగినన్ని అణ్వాయుధాలు కలిగి ఉండాలని అంటున్నారు. ద.కొరియాతో సరిహద్దు పంచుకుంటూండటం కూడా తమకు అతిపెద్ద ముప్పు అని చెప్పారు. అయితే ద.కొరియా ఈ వ్యాఖ్యలను ఖండించింది. అణుముప్పులను ఎదుర్కొనేందుకు అమెరికాతో కలిసి సంసిద్ధమవుతున్నట్లు తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement