అదొక దేశానికి చెందిన కీలక దౌత్య కార్యాలయపు ఫోన్ నంబర్. ఆ నెంబర్‌కు కాల్ చేయగానే.. అవతలి నుంచి వచ్చిన మెసేజ్ విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా అధికారిక సమాచారం లేదంటే స్వాగత సందేశం వినిపించాల్సిన చోట.. ఊహించని మాటలు వినిపించాయి. తొలిసారి విన్నవారికి అసలు ఇది ఆ కార్యాలయ అధికారిక సందేశమేనా? లేక ఎవరో కావాలనే మార్చేశారా? అనే అనుమానం కలిగింది. ఇంతకీ ఆ ఫోన్‌లో ఏం వినిపిస్తోంది? అసలు ఈ వింత మెసేజ్ వెనుక ఎవరున్నారు?
అమెరికా గడ్డపై ఉత్తర కొరియాకు ఉన్న ఏకైక దౌత్య కేంద్రం.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (యూఎన్)లో ఉన్న ఆ దేశ శాశ్వత మిషన్. ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో ఈ కార్యాలయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. యూఎన్ సభ్యదేశాల అధికారిక డైరెక్టరీలో ఈ మిషన్ ఫోన్ నంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు వినిపించే వాయిస్‌మెయిల్‌నే తాజాగా ఓ ఆసక్తికరమైన వ్యవహారానికి కేంద్రంగా మారింది.
ఏం వినిపించిందంటే..
తాజాగా ఆ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు వాయిస్‌మెయిల్‌లో సాధారణ కార్యాలయ సందేశానికి బదులు.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడే సందేశం వినిపించింది. అందులో ఉత్తర కొరియాలోని ఆహార కొరత, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావిస్తూ కిమ్‌పై సెటైర్లు వేసినట్లు సీక్రెట్ ఆడియోలో ఉంది. చివర్లో సందేశాలు స్వీకరించే మెయిల్‌బాక్స్ నిండిపోయిందని ఆటోమేటెడ్ వాయిస్ చెబుతోంది.
అంటే.. ఎవరో ఆ మిషన్ ఫోన్ వాయిస్‌మెయిల్ గ్రీటింగ్‌ను మార్చి, దాన్ని కిమ్‌ను ఎగతాళి చేసే సందేశంగా మార్చినట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ సందేశాన్ని ఎవరు పెట్టారు?.
మిషన్ సిబ్బందికే షాక్
ఈ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు సదరు మిషన్‌ను సంప్రదించగా.. ఈ నంబర్ తమది కాదన్నట్లుగా అక్కడి ఓ సిబ్బంది స్పందించడం మరింత ఆసక్తి రేపింది. ఈ నంబర్‌కు సంబంధించిన వాయిస్‌మెయిల్ గురించి అడిగినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసి, ‘‘ఇది మా నంబర్ కాదు’’ అని చెప్పి తలుపు మూసేశారని సమాచారం.
అయితే విచిత్రమేమిటంటే.. కొన్ని రోజుల తర్వాత ఉత్తర కొరియా ఉప విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించినప్పుడు ఆయన ప్రసంగ పత్రం మొదటి పేజీలో ఇదే ఫోన్ నంబర్ కనిపించింది. అంటే నంబర్ మాత్రం ఉత్తర కొరియా మిషన్‌దేనన్న విషయం స్పష్టమవుతోంది. కానీ వాయిస్ మెయిల్‌ను ఎవరు మార్చారన్నదే మిస్టరీగా మిగిలింది.
ఎలా మార్చగలిగారు?
ఇది వినగానే పెద్ద సైబర్ దాడి జరిగిందేమో అనిపించొచ్చు. కానీ సైబర్ భద్రతా నిపుణుల ప్రకారం.. ఇలాంటి వాయిస్‌మెయిల్ వ్యవస్థల్లో భద్రత బలహీనంగా ఉంటే వాటిని మార్చడం అంత కష్టమైన పని కాకపోవచ్చు. కొన్ని ఫోన్ వ్యవస్థల్లో వాయిస్‌మెయిల్ పాస్‌వర్డ్‌లు సులభంగా ఊహించగలిగే నాలుగు అంకెల కోడ్‌లుగా ఉండొచ్చు. వాటిని ఆటోమేటెడ్ కాల్స్‌తో కూడా ప్రయత్నించి యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఏదైనా దేశం చేసిన అత్యంత క్లిష్టమైన సైబర్ ఆపరేషనే అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఒక వ్యక్తి చేసిన చిలిపి పని కావొచ్చు!. ఎవరో కావాలనే రాజకీయ వ్యంగ్యంగా వాయిస్ మెయిల్‌ను మార్చేసి ఉండొచ్చు!!. అసలు ఎవరు చేశారన్నది మాత్రం తెలియరాలేదు.
ఇది ఇప్పుడే మొదలైందా?
కాదు. ఈ నంబర్ వాయిస్‌మెయిల్ గతంలో కూడా ఇదే తరహాలో ఉండేదా? అనే విషయాన్ని పరిశీలించినప్పుడు మరో ఆసక్తికరమైన అంశం బయటపడింది. 2023 నవంబర్‌లో ఈ నంబర్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. అప్పట్లో సాధారణ వాయిస్‌మెయిల్ సందేశమే వినిపించిందని చెప్పాడు. అంటే ప్రస్తుత వ్యంగ్య సందేశం ఆ తర్వాత ఎప్పుడో మార్చి ఉండే అవకాశం ఉంది.
ఒకప్పుడు కీలక దౌత్య మార్గం
న్యూయార్క్‌లోని ఉత్తర కొరియా మిషన్‌కు గతంలో మరింత ప్రాధాన్యం ఉండేది. అమెరికా–ఉత్తర కొరియా మధ్య నేరుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఈ మిషన్ ఒక అనధికారిక కమ్యూనికేషన్ మార్గంగా పనిచేసేది. 1990లలో ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై జరిగిన కీలక చర్చల్లోనూ ఈ ‘న్యూయార్క్ ఛానల్’ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రస్తుతం అమెరికా–ఉత్తర కొరియా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తర కొరియా రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. దీంతో న్యూయార్క్‌లోని ఈ దౌత్య మార్గం గతంతో పోలిస్తే అంత క్రియాశీలంగా లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అదే మిషన్ ఫోన్‌లో కిమ్‌ను ఎగతాళి చేస్తూ ఓ వింత సందేశం వినిపించడం చర్చనీయాంశంగా మారింది.


