అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు భారీ ఊరటనిచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాలు విధించే చట్టంలోని కీలక నిబంధనల అమలును ప్రస్తుతానికి నిలిపివేశారు. భారత్, చైనా సహా రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న దేశాలకు ముప్పుగా మారిన ఈ సుంకాల అమలుకు.. సరిగ్గా ఒక రోజు ముందే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మాస్కోకు అందుతున్న ఆర్థిక వనరులను తగ్గించాలనే లక్ష్యంతో అమెరికా కాంగ్రెస్ ‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ను ఆమోదించింది. సెప్టెంబర్ 18న ఈ చట్టంపై ట్రంప్ సంతకం చేశారు. రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించేందుకు ఈ చట్టం అధ్యక్షుడికి అధికారం కల్పించింది.
రష్యా ఇంధనాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే ఐదు దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై 100 శాతంలోపు ఎంతైనా సుంకాలు విధించే అవకాశం ఈ చట్టంలో ఉంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లను కొనసాగించే దేశాలపై అదనపు ఆర్థిక చర్యలు తీసుకునేందుకు కూడా వీలు కల్పించింది. సంతకం చేసిన నెలలోపే దీనిపై అధ్యక్షుడు ఓ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. దీంతో రష్యా చమురును పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్న భారత్, చైనా ఈ ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అయితే అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతానికి ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
జాతీయ ప్రయోజనాల పేరుతో మినహాయింపు
ఈ చట్టం కింద కొన్ని సుంకాలు, ఆంక్షల అమలును నిలిపివేస్తూ ట్రంప్ అక్టోబర్ 16న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ మినహాయింపు అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమని కాంగ్రెస్‌కు ధ్రువీకరణ సమర్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంక్షలు అమలైతే అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ప్రభావం పడటంతో పాటు అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు ఇంధన ధరలు పెరగడం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా సవాలుగా మారవచ్చు.
భారత్ ముందునుంచీ ఇదే చెబుతోంది
రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా అదనపు సుంకాలు విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పుడే భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రత తమకు అత్యంత ముఖ్యమని, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ అంశంపై అమెరికా అధికారులతో ఉన్నతస్థాయిలో చర్చలు జరిపినట్లు కూడా వెల్లడించింది.
ఒకవేళ 100 శాతం అదనపు సుంకాలు అమలైతే అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ వస్తువులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండేది. అమెరికా భారత్‌కు ప్రధాన ఎగుమతి మార్కెట్ కావడంతో వస్త్రాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఇతర వస్తువుల ఎగుమతులపై అదనపు వ్యయభారం పడే ప్రమాదం ఉండేది. సుంకాల పరిధి, అమలు విధానం ఖరారైతేనే వాస్తవ ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయగలిగేవారు.
తాజా నిర్ణయంతో ఆ తక్షణ ముప్పు తప్పింది. అయితే, ఇది శాశ్వత ఉపసంహరణ కాదు. భవిష్యత్తులో అవసరమని భావిస్తే ఆంక్షలను మళ్లీ అమలు చేసే అవకాశం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. పరిస్థితులను బట్టి తదుపరి చర్యలు తీసుకునే అధికారాన్ని అమెరికా ప్రభుత్వం అట్టిపెట్టుకుంది.
పుతిన్‌తో ఇంధన ఒప్పందం.. జెలెన్స్కీపై విమర్శలు
మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ సంబంధాలు, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరి కూడా చర్చనీయాంశంగా మారాయి. రష్యా నుంచి డీజిల్ సరఫరాలపై ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరాలను పెంచడం, ధరల ఒత్తిడిని తగ్గించడం ఈ ప్రయత్నం వెనుక లక్ష్యాలుగా చెబుతున్నారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీపై ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. రష్యాతో యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో జెలెన్స్కీ విఫలమవుతున్నారని వ్యాఖ్యానిస్తూ, ఉక్రెయిన్‌కు కొత్త నాయకుడు అవసరమని కూడా అన్నారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఉద్దేశించిన చట్టంలోని సుంకాలను నిలిపివేయడం, మరోవైపు పుతిన్‌తో ఇంధన ఒప్పందంపై ముందుకు సాగడం వంటి పరిణామాలు అమెరికా విదేశాంగ విధానంపై చర్చకు దారితీశాయి.
ఇదీ చదవండి: ట్రంప్‌కే ఎందుకిలా అవుతోంది!


