ఐదు రోజులకే ఔట్‌.. ట్రంప్‌ ప్రెస్‌ సెక్రటరీ రికార్డు! | Trump Press Secretary Katie Zacharia Sets Record Fired in Less Than a Week | Sakshi
Sakshi News home page

ఐదు రోజులకే ఔట్‌.. ట్రంప్‌ ప్రెస్‌ సెక్రటరీ రికార్డు!

Oct 17 2026 8:38 AM | Updated on Oct 17 2026 8:40 AM

Trump Press Secretary Katie Zacharia Sets Record Fired in Less Than a Week

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా నియమించిన కేటీ జకారియా పదవిలో వారం రోజులు కూడా పూర్తికాకముందే వైదొలగాల్సి వచ్చింది.  ఆమెను పదవి నుంచి తొలగించినట్లు వైట్‌హౌస్‌ అధికారికంగా ప్రకటించింది.  దీంతో కీలకమైన మధ్యంతర ఎన్నికలకు రెండు వారాల ముందు ట్రంప్‌ తన ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ముఖ్య ప్రతినిధిని కోల్పోవడం గమనార్హం.

కేటీ జకారియా(Katie Zacharia) ప్రెస్‌ సెక్రటరీ పదవిలో కొనసాగడంపై ట్రంప్‌ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బాధ్యతల్లో కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని ఆమెకు సూచించానని ఆయన తెలిపారు. ‘‘నువ్వు సంతోషంగా ఉండటమే మంచిదని చెప్పా. ఈ పనిలో నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండగలవో లేదో నాకు తెలియదు. ఇదేమీ సులభమైన పని కాదు’’ అని జకారియాతో అన్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. మరోసారి ఈ విషయంపై మాట్లాడతానని కూడా చెప్పారు. అయితే, ఆ వెంటనే ఆమెను పదవి నుంచి తొలగించినట్లు వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు.

బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆమె న్యాయవిద్యార్హతలపై ప్రశ్నలు, మీడియా సమావేశంలో పనితీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కేటీ జకారియా నేపథ్యం
41 ఏళ్ల కేటీ జకారియా కాలిఫోర్నియాలో జన్మించారు. పెప్పర్‌డైన్‌ యూనివర్సిటీలో 2007లో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ, 2011లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. జార్జ్‌ డబ్ల్యూ. బుష్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్‌హౌస్‌లో ఇంటర్న్‌గా పనిచేశారు. అనంతరం చైనాలోని బీజింగ్‌లో అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన న్యాయ సంస్థలో పనిచేశారు. ఫాక్స్‌ న్యూస్‌, న్యూస్‌మాక్స్‌ వంటి సంస్థల్లో రాజకీయ వ్యాఖ్యాతగా, అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగంలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లలు. 

న్యాయవిద్య.. బార్‌ పరీక్షపై వివాదం
కరోలిన్‌ లీవిట్‌ స్థానంలో కేటీ జకారియాను ప్రెస్‌ సెక్రటరీగా ట్రంప్‌ ఇటీవల నియమించుకున్నారు. ఈ నెల 12న బాధ్యతలు చేపట్టి.. మరుసటి రోజే తొలిసారిగా వైట్‌హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఆమె గతంలో న్యాయవాదిగా పనిచేశారన్న అంశంపై ప్రశ్నలు మొదలయ్యాయి. తాను అంతర్జాతీయ లావాదేవీల చట్టానికి సంబంధించిన న్యాయవృత్తిలో పనిచేశానని, అందుకు అవసరమైన అర్హతలు ఉన్నాయని జకారియా వెల్లడించారు.

కానీ, అమెరికాలోని ఏ రాష్ట్రంలోనూ లేదంటే కొలంబియా జిల్లాలోనూ ఆమె న్యాయవాదిగా నమోదైనట్లు ఆధారాలు లభించలేదని అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. పెప్పర్‌డైన్‌ యూనివర్సిటీలో న్యాయవిద్య అభ్యసించిన జకారియా.. గురువారం ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బార్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని అంగీకరించారు. అమెరికాలో న్యాయవాదిగా పనిచేయాలంటే సంబంధిత రాష్ట్ర బార్‌లో ప్రవేశం పొందడం తప్పనిసరి. ఈ వ్యవహారం ఆమెపై విమర్శలకు మరింత ఆజ్యం పోసింది.

మీడియా కవరేజీపై ట్రంప్‌ అసంతృప్తి
తన ప్రభుత్వ పనితీరుపై మీడియా కవరేజీ విషయంలో ట్రంప్‌ అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి మరింత సమర్థంగా తీసుకెళ్లే ప్రతినిధి కావాలని భావించారు. అందుకే జకారియాను ఎంపిక చేశారు. అయితే, ఆమె నియామకం తర్వాత తొలి రోజుల్లోనే వివాదాలు చుట్టుముట్టడంతో పరిస్థితి మారిపోయింది.

ప్రస్తుతం కొత్త ప్రెస్‌ సెక్రటరీ నియామకంపై తొందరపడటం లేదని ట్రంప్‌..  ఫాక్స్‌ న్యూస్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు. జకారియా వైదొలగడం వైట్‌హౌస్‌ చరిత్రలో అత్యంత స్వల్పకాలం ప్రెస్‌ సెక్రటరీగా పనిచేసిన ఉదంతంగా నిలిచే అవకాశం ఉందని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్‌ తొలి పాలనలో కేవలం పది రోజుల పాటు కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆంథోనీ స్కారముచీ ఈ పరిణామంపై స్పందిస్తూ.. రికార్డులు బద్దలవుతుంటాయని, అయితే ఇతరుల బాధలో తాను ఆనందించనని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ట్రంప్‌ కోడలిగా ఛాన్స్‌ మిస్‌.. ఎవరీమె?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement