అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. గ్రీస్‌లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కింబర్లీ గిల్ఫాయిల్ను రాజీనామా చేయాలని వైట్‌హౌస్ ఆదేశించింది. ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులతో పరిచయాలు కల్పిస్తానంటూ ఓ సంపన్న మద్దతుదారుడిని తన క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలని ఆమె కోరినట్లు వచ్చిన ఆరోపణలు ఈ పరిణామానికి దారితీశాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గిల్‌ఫాయిల్(57) వ్యవహారంపై సెప్టెంబర్ చివరి నుంచి వాల్‌స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురించింది. గ్రీకు ఇంధన సంస్థకు చెందిన లాబీయిస్ట్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ వ్యాపార ప్రయోజనాలను ప్రోత్సహించారని ఆరోపించింది. ప్రైవేటు దౌత్య సమావేశాలకు ఆ లాబీయిస్ట్‌ను అనుమతించారన్న ఆరోపణలూ వెలువడ్డాయి.
మరో కథనంలో.. ఓ విందు సందర్భంగా అమెరికా కోరుకుంటే గ్రీకు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయగలదని గిల్‌ఫాయిల్ వ్యాఖ్యానించిదని వార్త ఇచ్చింది. గ్రీకు వ్యాపారవేత్తలతో విలాసవంతమైన పర్యటనలు, దావోస్‌లో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానం పొందేందుకు ఆమె చేసిన ప్రయత్నాలపైనా వార్తలు వచ్చాయి. ఏథెన్స్లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందితో ఆమె వ్యవహారశైలిపై ఫిర్యాదులు వచ్చినట్లు బ్రిటన్ మీడియా వెల్లడించింది.

లక్ష డాలర్ల బిల్లుతో వివాదం ముదిరి..
ఈ ఆరోపణల్లో అత్యంత తీవ్రమైనది క్రెడిట్ కార్డు బిల్లుకు సంబంధించినది. ట్రంప్ మద్దతుదారుడైన వ్యాపారవేత్త ఎరిక్ డీటర్స్ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. గిల్‌ఫాయిల్ తన లక్ష డాలర్ల క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించాలని ఆయనను కోరినట్లు తెలుసస్తోంది. ప్రతిఫలంగా ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను కలిసే అవకాశం కల్పిస్తానని చెప్పినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన సందేశాలనూ పత్రిక ప్రస్తావించింది.
అయితే గిల్‌ఫాయిల్ న్యాయవాదులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమె రాయబారిగా నామినేట్ కావడానికి ముందే నిర్వహించిన ప్రసంగాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన బకాయి పారితోషికమే ఆ మొత్తమని వివరించారు. ప్రైవేటు విమానాల వినియోగంపై వచ్చిన ఆరోపణలను కూడా ఖండించారు. ప్రయాణాలకు ముందు విదేశాంగ శాఖ మార్గదర్శకాలు తీసుకున్నారని, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని తెలిపారు.
ట్రంప్ కోడలి చాన్స్ మిస్
కింబర్లీ గిల్‌ఫాయిల్ వ్యక్తిగత జీవితంలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఆమె కాలిఫోర్నియాలో ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. అనంతరం ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. ట్రంప్ రాజకీయ ప్రచార బృందంలోనూ పనిచేశారు. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో 2020 చివర్లో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ విషయం రెండేళ్ల తర్వాత అధికారికంగా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ.. 2024 సెప్టెంబర్‌లో ఆ బంధం ముగిసింది.

అంత జరిగినా.. అనంతరం ట్రంప్ ఆమెను గ్రీస్‌లో అమెరికా రాయబారిగా నియమించారు. 2025 నవంబర్‌లో ఏథెన్స్లో బాధ్యతలు చేపట్టిన ఆమె.. అమెరికా ఇంధన ప్రయోజనాల కోసం ఎల్ఎన్జీ దిగుమతులు, చమురు-గ్యాస్ అన్వేషణ ఒప్పందాలను ప్రోత్సహించారు.
ట్రంప్ అసంతృప్తి.. రాజీనామాకు ఆదేశాలు
వరుస కథనాలపై సోమవారం విలేకరులు ప్రశ్నించగా.. గిల్ఫాయిల్ను తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. వెలువడుతున్న వార్తలతో తాము సంతోషంగా లేమని వ్యాఖ్యానించారు. మంగళవారం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా ఆమెను రాజీనామా చేయాలని కోరినట్లు ధ్రువీకరించారు. గిల్‌ఫాయిల్ తమ బృందానికి ఎంతో ఉపయోగపడ్డారని, ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
మరోవైపు గిల్‌ఫాయిల్ ఎక్స్‌లో స్పందిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. తన పేరు, ప్రతిష్ఠ, నిజాయితీని కాపాడుకునేందుకు న్యాయపరంగా పోరాడతానని పేర్కొన్నారు. ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పట్ల తన గౌరవం, మద్దతు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
దర్యాప్తునకు డెమోక్రాట్ల డిమాండ్
గిల్‌ఫాయిల్ వ్యవహారంపై విచారణ జరపాలని డెమోక్రటిక్ పార్టీకి చెందిన గ్రెగరీ మీక్స్, జీన్ షాహీన్, రాబర్ట్ గార్సియా డిమాండ్ చేశారు. ఆమె అధికారిక హోదాను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై స్పష్టత రావాలని కోరారు. అంతకుముందు గ్రీస్ పర్యటనలో రూబియో ఆమెను సమర్థమైన రాయబారిగా అభివర్ణించారు. అయితే ఆరోపణలను ధ్రువీకరించకుండా, అజ్ఞాత వర్గాల సమాచారాన్ని వాస్తవాలుగా పరిగణించకూడదని విలేకరులకు సూచించారు.
నాటోలో కీలక మిత్రదేశమైన గ్రీస్.. తూర్పు మధ్యధరా ప్రాంతంలో అమెరికా భద్రతా కార్యకలాపాలకు అవసరమైన సైనిక సదుపాయాలను అందిస్తోంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు ఉద్దేశించిన యూరోపియన్ యూనియన్ సముద్ర మిషన్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి వ్యూహాత్మక దేశంలో అమెరికా రాయబారిపై వివాదం చెలరేగడం దౌత్యపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గిల్ఫాయిల్పై వచ్చిన ఆరోపణలపై గ్రీస్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
కొసమెరుపు.. కింబర్లీకి గతంలో రెండుసార్లు వివాహమైంది. 2001లో గావిన్ న్యూసమ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉన్నారు. వీరిద్దరూ 2005లో విడాకులకు దరఖాస్తు చేసుకోగా, 2006లో విడాకులు ఖరారయ్యాయి. అదే ఏడాది వ్యాపారవేత్త ఎరిక్ విలెన్సీని వివాహం చేసుకున్న కింబర్లీకి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ వివాహం కూడా 2009లో ముగిసింది.
ఇక డొనాల్డ్ ట్రంప్ జూనియర్ 2005లో వెనెస్సా ట్రంప్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు. 2018లో విడిపోయిన ఈ జంటకు అదే ఏడాది విడాకులు ఖరారయ్యాయి. ఆ తర్వాత 2018లో తనకన్నా వయసులో 9 ఏళ్లు పెద్దదైన కింబర్లీతో ప్రేమలో పడ్డాడు. 2020 డిసెంబరు 31న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని 2022లో బహిరంగంగా వెల్లడించారు. 2024లో వీరిద్దరూ విడిపోయారు.
ఇదీ చదవండి: ఎన్నికలయ్యాక మీ అంతు చూస్తా.. ట్రంప్ సాలిడ్ వార్నింగ్


