ఒట్టావా: దొంగతనం చేసేటప్పుడు ఆధారాలు దొరక్కుండా చోరులు జాగ్రత్త పడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన నేరానికి సంబంధించిన కీలక ఆధారాలను తనకు తెలియకుండానే పోలీసులకు అందించాడు. కెనడాలో జరిగిన ఈ విచిత్ర ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దొంగతనం చేయడానికి ఉపయోగించిన స్మార్ట్ గ్లాసెస్ చివరకు అతడిని పట్టించే ఆధారాలుగా మారాయి.
అసలేం జరిగింది?
కెనడాలోని కుక్‌స్టౌన్‌లో నవంబర్ 11న రాత్రి 7.30 గంటల సమయంలో ఓ వ్యక్తి కళ్లద్దాల దుకాణంలోకి వెళ్లాడు. అక్కడ రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను ధరించి చూసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న నకిలీ కళ్లద్దాలతో అసలైన వాటిని మార్చేశాడు. అనంతరం నకిలీ కళ్లద్దాలను దుకాణ సిబ్బందికి తిరిగి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అడ్డంగా దొరికిన ఆధారం!
కళ్లద్దాలు మారిపోయిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది.. అంతకుముందు ఆ స్మార్ట్ గ్లాసెస్‌తో జత చేసిన పరికరాన్ని పరిశీలించారు. అందులో ఊహించని విషయం బయటపడింది. గ్లాసెస్‌లోని రికార్డింగ్ ఫీచర్ అనుకోకుండా యాక్టివేట్ కావడంతో నిందితుడికి సంబంధించిన వీడియో, చిత్రాలు ఆ పరికరంలో అప్‌లోడ్ అయ్యాయి.
పోలీసుల విజ్ఞప్తి
ఈ వీడియో, చిత్రాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు సౌత్ సిమ్‌కో పోలీసు విభాగం రంగంలోకి దిగింది. అతడి స్పష్టమైన చిత్రాలను ప్రజలకు విడుదల చేసింది. నిందితుడి గురించి తెలిసినవారు, అతడిని గుర్తించగలిగినవారు సమాచారం అందించాలని కోరింది.


