పంచాయతీ ఎన్నికల అప్‌డేట్స్..
పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పులివెందులలో ఉద్రిక్తత..
- పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు
- పోలీసుల ఏకపక్ష వైఖరిపై జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడిన అవినాష్ రెడ్డి
- తన వాహనం ఎక్కడానికి పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి వద్ద నుంచి పార్టీ ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తున్న అవినాష్ రెడ్డి
నేడు రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు..
రెండో విడతలో 3,880 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఎక్కువ చోట్ల ఎన్నికలు
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎక్కడికక్కడే ఓట్ల లెక్కింపు
👉రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 83,52,338 మంది ఓటర్లు తీర్పు వెలువరించనున్నారు. 3,880 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎక్కడికక్కడే ఓట్ల లెక్కింపు చేపడతారు. 41.05 లక్షల మంది పురుష ఓటర్లు, 42.46 లక్షల మంది మహిళా ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
👉నాలుగు గ్రామీణ మండలాలే ఉన్న విశాఖపట్నం జిల్లా మినహా మిగిలిన 27 జిల్లాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 4,975 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగా, 1170 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. 1095 పంచాయతీల్లో సర్పంచి పదవులతో పాటు గ్రామంలోని వార్డు సభ్యుల పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయని అధికారులు తెలిపారు. రెండు చోట్ల సర్పంచి పదవులకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో 3,803 గ్రామాల్లో సర్పంచి పదవులకు, 3,880 పంచాయతీల్లో వార్డులకు ఎన్నికలు జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
👉రెండో విడతలో అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనే 342 పంచాయతీల్లో, విజయనగరం జిల్లాలో 244 సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 52 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతుంది. గుంటూరు, మార్కాపురం, బాపట్ల, వైఎస్సార్ కడప, పశ్చిమ గోదావరి జిల్లాలో వంద లోపు పంచాయతీల్లోనే ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.


