చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌ | Interstate thief arrested in theft case | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

Nov 29 2026 3:43 AM | Updated on Nov 29 2026 3:43 AM

Interstate thief arrested in theft case

ఎన్టీఆర్‌ జిల్లా గుంటుపల్లిలో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు  

654 గ్రాముల బంగారం, రూ.9.50లక్షల నగదు స్వాదీనం 

నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 94 కేసులు   

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసులో నిందితుడైన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.92లక్షల విలువైన 654 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.9.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి గుంటుపల్లిలోని ఓ ఇంట్లో 764 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 

బాధితుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం సీఐ ఎ.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి అనుమానితుడి కదలికలను పోలీసులు గుర్తించారు. శనివారం విజయవాడ వన్‌టౌన్‌లోని వినాయకుడి గుడి సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసినవాటిలో కొన్ని ఆభరణాలను విక్రయించి నగదుతో వస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం సేపన్నపేటకు చెందిన పోలాకి అప్పలనాయుడుగా గుర్తించారు. ప్రస్తుతం అతను రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో నివసిస్తున్నాడు. 

జల్సాలకు అలవాటు పడి... 
చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో అక్కాబావల వద్ద పెరిగిన అప్పలనాయుడు, ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్‌ చేరుకుని లారీ మెకానిక్‌గా, డ్రైవర్‌గా, డెకరేషన్‌ వర్కర్‌గా, మేకప్‌ అసిస్టెంట్‌గా పనిచేశాడు. జల్సాలకు అలవాటు పడి  మైనర్‌గా ఉండగానే 1999లో జూబ్లీహిల్స్‌ పరిధిలో తొలిసారి చోరీ చేసి జువైనల్‌ హోంకు వెళ్లాడు. ఆ తర్వాత వరుస చోరీలకు పాల్పడుతూ కరుడుగట్టిన నేరస్తుడిగా మారాడు. 

ఇళ్లలో మనుషులు నిద్రిస్తున్న సమయంలోనే కిటికీలోంచి చేయి పెట్టి లోపలి గడియ తీసి చోరీలు చేయడం ఇతని ప్రత్యేకత. అప్పలనాయుడిపై హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తిరుపతిలో కలిపి మొత్తం 94 చోరీ కేసులు ఉన్నాయి. అతనిపై 2019లో పీడీ యాక్ట్‌ను కూడా నమోదు చేశారు. అప్పలనాయుడు 2024లో మక్తల్‌లో చేసిన చోరీ కేసులో జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం పోలీసుల నిఘా తప్పించుకునేందుకు రెండు వారాల క్రితం విజయవాడకు మకాం మార్చాడు. రెక్కీ నిర్వహించి గుంటుపల్లిలో చోరీకి పాల్పడ్డాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement