ప్రైవేట్‌ వర్సిటీల ఫీజుల దోపిడీ ఆందోళనకరం | Fee extortion by private universities is a concern | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ వర్సిటీల ఫీజుల దోపిడీ ఆందోళనకరం

Nov 29 2026 3:50 AM | Updated on Nov 29 2026 3:50 AM

Fee extortion by private universities is a concern

పూర్తిస్థాయి అధ్యాపకులు, పరిశోధన సదుపాయాలు లేకుండానే కోర్సులు 

కారుచౌకగా భూములు తీసుకుంటూ విద్యార్థులకు రాయితీలివ్వడంలేదు 

ఇది సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తోంది 

ప్రభుత్వ తీరును ఆక్షేపించిన ఏపీ పేరెంట్స్‌ అసోసియేషన్‌   

సాక్షి, అమరావతి: దేశీయ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల పనితీరు, వాటి ఫీజుల దోపిడీపై కాగ్, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ వంటి ఉన్నత స్థాయి నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఉన్నత విద్య ఎటువైపు వెళ్తోందో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని ది పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరహరి శిఖరం, జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, దేశవ్యాప్తంగా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల సంఖ్య 450 దాటినా, వాటిలో ఫీజుల నిర్ణయం, రిజర్వేషన్ల అమలుపై స్పష్టమైన పర్యవేక్షణలేదని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తన నివేదికలో స్పష్టంచేసిందని వారు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అనేక ప్రైవేట్‌ వర్సిటీలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా డెవలప్‌మెంట్‌ ఫీజు, కెరీర్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో లక్షలాది రూపాయలు వసూలుచేస్తున్నాయని, యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పూర్తిస్థాయి అధ్యాపకులు, పరిశోధన సదుపాయాలు లేకుండానే కోర్సులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రధాన ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు అత్యంత విలువైన భూములు దాదాపు 600 ఎకరాలకు పైగా కారుచౌకగా కేటాయించిందని.. అయినప్పటికీ, ఆయా వర్సిటీలు సామాన్య, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజుల్లో ఆ స్థాయి రాయితీలు ఇవ్వడంలేదన్నారు. 

ప్రజల ఆస్తి అయిన భూమిని రాయితీపై పొంది, తిరిగి విద్యార్థుల నుండే భారీ ఫీజులు వసూలుచేయడంపై తల్లిదండ్రుల సంఘం ప్రధానంగా అభ్యంతరం వ్యక్తంచేస్తోందని వారు పేర్కొన్నారు. విదేశీ వర్సిటీలు కూడా సొంత క్యాంపస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.వందల కోట్ల పెట్టుబడిని ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచే వసూలుచేసే అవకాశం ఉందని, ఇది సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను పూర్తిగా దూరం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు యూజీసీ–2023లో నిబంధనలు తీసుకొచ్చి మూడేళ్లు గడిచినా, ఆశించిన స్థాయిలో క్యాంపస్‌లు అందుబాటులోకి రాలేదన్నారు.  

తక్షణమే ఆడిట్‌ నిర్వహించాలి.. 
ఇక బోధనా సిబ్బందిలేక రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయని, ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని నరహరి శిఖరం, జి.ఈశ్వరయ్య తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ఫీజుల నియంత్రణ, రిజర్వేషన్ల అమలు, రాయితీ భూములకు అనుగుణంగా పేద విద్యార్థులకు కల్పిస్తున్న ఫీజు మినహాయింపులపై తక్షణమే ఆడిట్‌ నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement