ఒరిజినల్స్‌ విద్యార్థి హక్కు.. కళాశాల సొత్తు కాదు | High Court has clarified that it is entirely illegal for college management to retain original certificates | Sakshi
Sakshi News home page

ఒరిజినల్స్‌ విద్యార్థి హక్కు.. కళాశాల సొత్తు కాదు

Nov 29 2026 3:54 AM | Updated on Nov 29 2026 3:56 AM

High Court has clarified that it is entirely illegal for college management to retain original certificates

సర్టిఫికెట్లు వారంలో ఇచ్చేయాలని విద్యా సంస్థకు హైకోర్టు ఆదేశాలు 

ఫీజు వసూలుకు వాటిని ఆపడం చట్టవిరుద్ధమని స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి:  కోర్సు ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యం తమ వద్దే ఉంచుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో కళాశాలకు న్యాయమైన క్లెయిమ్‌ ఉన్నప్పటికీ ఫీజు వసూలు చేసే మార్గంగా సర్టిఫికెట్లను నిలిపివేయడం చట్టబద్ధం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీ అందిన వారం రోజుల్లోపు పిటిషనర్‌కు అతని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయాలని గుంటూరు జిల్లా పెరేచర్లలోని ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యాజమాన్యాన్ని ఆదేశించారు. 

గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన కొరివి కుమార్‌బాబు 2015లో ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌లో చేరారు. తండ్రి మరణంతో చదువును మధ్యలోనే ఆపేశారు. అడ్మిషన్‌ సమయంలో సమర్పించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని 2022 నవంబర్‌లో విద్యాశాఖ అధికారులను కోరారు. అధికారులు నోటీసులు ఇచ్చినా కళాశాల యాజమాన్యం పూర్తి కోర్సు ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో  2025లో హైకోర్టును ఆశ్రయించారు.  

జీవించే హక్కులో భాగం 
ఒరిజినల్‌ సర్టిఫికెట్లు విద్యార్థి ఆస్తి. అవి విద్యాహక్కుకు సంబంధించినవి. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం జీవించే హక్కులో భాగం. ఉన్నత విద్యను అభ్యసించడానికి, వృత్తిపరమైన కోర్సుల్లో చేరడానికి, ఉపాధి పొందడానికి అవి పునాది వంటివి.  విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లపై విద్యా సంస్థకు ఎలాంటి హక్కు లేదు.  సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలంటే పూర్తి కోర్సు ఫీజు చెల్లించాలన్న కళాశాల డిమాండ్‌ యూజీసీ నోటిఫికేషన్‌కు çపూర్తి విరుద్ధం. ఒరిజినల్స్‌ను ధ్రువీకరించుకున్న తర్వాత వాటిని తిరిగి విద్యార్థికి అప్పగించి, రికార్డుల కోసం అటెస్టెడ్‌ కాపీలను మాత్రమే విద్యా సంస్థలు ఉంచుకోవాలని నోటిఫికేషన్‌ మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి.   – తీర్పులో జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement