ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగిని టీడీపీ ఎమ్మెల్యే బెదిరించడం దారుణం
ఎమ్మెల్యే సురేంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరావిురెడ్డి డిమాండ్
సాక్షి,అమరావతి: చంద్రబాబు పాలనలో నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల ఆత్మగౌరవానికి తీవ్ర భంగం కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరావిురెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం తిమ్మాపురం పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఇంటికి వచ్చి అంతుచూస్తానని బెదిరించడం దారుణమని, అధికార పార్టీ అరాచకత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలో శనివారం వెంకటరావిురెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిపై దుర్భాషలాడిన టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఉపాధ్యాయుడిని బెదిరిస్తున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నా.. ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలు స్పందించకపోవడాన్ని వెంకటరావిురెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
అధికార పార్టీ అహంకారానికి పరాకాష్ట
‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఆ పార్టీ కూటమి నేతలు బరితెగించిపోతున్నారు. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నేతల బెదిరింపులకు ఉద్యోగులు బలైపోతున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్టు పనిచేయలేక నిస్సహాయస్థితిలో నలిగిపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తాను ఎమ్మెల్యేనని మరిచి ఫోన్‌లో బండబూతులు తిట్టారు. అది ఓ ప్రజాప్రతినిధి మాట్లాడే భాషేనా? ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి కొడతామని బెదిరిస్తారా? ఇది అధికారపార్టీ అహంకారానికి పరాకాష్ట.’’ అని వెంకటరావిురెడ్డి దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడి ఉపాధ్యాయుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
ఉద్యోగులను గౌరవిస్తామన్న సీఎం హామీ ఏమైంది?
‘‘ఎని్నకల సమయంలో సీఎం చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన మొట్టమొదటి హామీ ఏమిటి? ’గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకుంటాం’ అని చెప్పారు. ఇదేనా మీరు ఉద్యోగులను గౌరవంగా చూసుకునే విధానం? కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగులపై దాడులు జరిగాయి, కార్యాలయాల్లోకి చొరబడి కొట్టారు. ఇంతవరకు ఒక్క టీడీపీ ప్రజాప్రతినిధిపై కూడా కేసు పెట్టలేదు.’’ అని వెంటరావిురెడ్డి విమర్శించారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే తీరుపై కలెక్టర్‌తోపాటు ప్రభుత్వం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని కాకర్ల ప్రశ్నించారు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవానికి సబంధించిన విషయమని, దీనిపై ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని వెంకటరావిురెడ్డి పిలుపునిచ్చారు.


