‘ఎంపీలు వస్తారు.. చప్పట్లు కొట్టి వెళ్తారు’ | Shashi Tharoor on centres Constitutional Amendment bill short term Thinking | Sakshi
Sakshi News home page

‘ఎంపీలు వస్తారు.. చప్పట్లు కొట్టి వెళ్తారు’

Nov 29 2026 1:42 PM | Updated on Nov 29 2026 1:45 PM

Shashi Tharoor on centres Constitutional Amendment bill short term Thinking

న్యూఢిల్లీ: లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 850కి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఇప్పటికే 540 మంది సభ్యులతోనే సభా కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా ఉందని, అలాంటప్పుడు 815 మంది సభ్యులతో లోక్‌సభ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక దేశ ప్రయోజనాలున్నాయా? లేక రాజకీయ ప్రయోజనాలున్నాయా? అని నిలదీశారు.

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ బిల్లు స్వల్పకాలిక ఆలోచనతో తీసుకొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? లేక వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అని ప్రశ్నించారు.

850కి పెరగనున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య
కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 132వ సవరణ బిల్లు-2026 ద్వారా లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలని ప్రతిపాదించారు. ఇందులో రాష్ట్రాల నుంచి గరిష్ఠంగా 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది సభ్యులు ఉండనున్నారు. రాష్ట్రాల శాసనసభల గరిష్ఠ సభ్యుల సంఖ్యను కూడా 500 నుంచి 650కి పెంచాలని ప్రతిపాదించారు.

ప్రశ్నించేందుకు ఎంపీలకు సమయం దొరకదా?
ప్రస్తుతం ఎంపీలకు మంత్రులను ప్రశ్నించేందుకు, తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకు, జీరో అవర్‌లో మాట్లాడేందుకు తగినంత అవకాశం లభించడం లేదని థరూర్‌ అన్నారు. సభ్యుల సంఖ్య 815కి చేరితే పరిస్థితి మరింత కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. చాలామంది సభకు వచ్చి కేవలం చప్పట్లు కొట్టి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఎద్దేవా చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసమేనా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా, జవాబుదారీతనాన్ని పెంచేలా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సంస్థలు పనిచేయాలని థరూర్‌ అన్నారు. సభ్యుల సంఖ్యను ఇంత భారీగా పెంచితే ఆ లక్ష్యం నెరవేరుతుందా? అని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలోనూ తమ పార్టీకి ప్రయోజనం కలిగేలా సరిహద్దులను గీయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమా? అని విమర్శించారు. వచ్చే రెండేళ్లు లేదా ఐదేళ్ల ఎన్నికల గురించి మాత్రమే కాకుండా, దేశ దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని సూచించారు.

విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు
రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలు సంఖ్యాబలాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ఇండియా కూటమి నేతలు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌తో చర్చలు జరపనున్నారు.

ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందా?
డీలిమిటేషన్‌ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఈ బిల్లు వల్ల షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శాశ్వతంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ఈ చర్య చేపడుతున్నాయని విమర్శిస్తున్నాయి.

ఇదీ చదవండి: మాదకద్రవ్యాల ముప్పుపై మోదీ హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement