నేపాల్ నుంచి అయోధ్యకు రైలు.. అంతటా జై శ్రీరామ్‌ నినాదాలు! | Aodhya Nepal 51 Devotees Special Train Ramtilakotsav | Sakshi
Sakshi News home page

నేపాల్ నుంచి అయోధ్యకు రైలు.. అంతటా జై శ్రీరామ్‌ నినాదాలు!

Nov 29 2026 12:54 PM | Updated on Nov 29 2026 12:54 PM

Aodhya Nepal 51 Devotees Special Train Ramtilakotsav

అయోధ్య: యూపీలోని అయోధ్యలో శ్రీరామ  నిత్యపూజా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత్, నేపాల్ మధ్య ఉన్న పురాతన ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఓ ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. నేపాల్‌లోని జనక్‌పూర్‌ ధామ్ నుంచి 51 మంది భక్తులు ప్రత్యేక రైలులో అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరాముడి తిలకోత్సవంలో పాల్గొని స్వామివారికి తిలకం సమర్పించేందుకు వీరంతా వచ్చారు.

పూలవర్షంతో ఘన స్వాగతం
ఆదివారం ఉదయం కమలా సరయూ ఎక్స్‌ప్రెస్ అయోధ్య రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైలు నుంచి దిగిన నేపాల్ భక్తులపై పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. జై శ్రీరామ్ నినాదాలతో రైల్వే స్టేషన్ మార్మోగింది. అయోధ్య మహానగర అధ్యక్షుడు కమలేశ్ శ్రీవాస్తవ పూలు అందించి అతిథులను ఆహ్వానించారు.

తొలిసారి రైలులో ప్రయాణం
జనక్‌పూర్‌లోని జానకీ ఆలయం తరఫున 51 మంది సభ్యులతో కూడిన తిలకధారుల బృందం ఈ ప్రత్యేక రైలులో అయోధ్యకు చేరుకుంది. నేపాల్ మేయర్ మనోజ్ షా ఈ ప్రయాణాన్ని చారిత్రక, భావోద్వేగ ఘట్టంగా అభివర్ణించారు. శ్రీరాముడి కోసం తొలిసారిగా ప్రత్యేక రైలులో తిలకం తీసుకొచ్చే అవకాశం దక్కడం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రయాణ ఏర్పాట్లు కూడా బాగున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు కృతజ్ఞతలు తెలిపారు.

నేపాల్‌కు చెందిన సంతోష్ కుమార్ రావత్ మాట్లాడుతూ.. భారత్, నేపాల్ సంబంధాలు కేవలం రెండు దేశాల మధ్య ఉన్న బంధాలు మాత్రమే కాదని, ఉమ్మడి మత, సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇరు దేశాల ప్రజలను మరింత దగ్గర చేస్తాయని అన్నారు. భగవాన్ శ్రీరాముడి తిలకోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టమని శ్రవణ్ కుమార్ ఝా తెలిపారు. శ్రీరామ వివాహ మహోత్సవంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాటాక మూడు గంటల ప్రాంతంలో అయోధ్యధామంలో శ్రీరాముడి తిలకోత్సవం నిర్వహించనున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, సంప్రదాయ ఆచారాల మధ్య జనక్‌పూర్‌ నుంచి వచ్చిన తిలకధారుల బృందం స్వామివారికి తిలకం సమర్పించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement