పేరు వినగానే డ్రైవర్ హత్య.. నిందితుడు భారతీయుడు! | Uber Driver Strangled By Indian Man Over Mohamed Name Dies In US | Sakshi
Sakshi News home page

పేరు వినగానే డ్రైవర్ హత్య.. నిందితుడు భారతీయుడు!

Nov 29 2026 10:45 AM | Updated on Nov 29 2026 10:45 AM

Uber Driver Strangled By Indian Man Over Mohamed Name Dies In US

వాషింగ్టన్‌: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఉబర్ డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపోలిస్‌ శివారు ప్రాంతంలో నవంబర్ 14న ఈ ఘటన చోటుచేసుకుంది. సోమాలి-అమెరికన్‌కు చెందిన మహమ్మద్ యూసుఫ్ (51) అనే డ్రైవర్‌పై ప్రయాణికుడు సమిత్ అపూర్వ పటేల్ (25) దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన యూసుఫ్.. శనివారం ఉదయం హెనెపిన్ కౌంటీ మెడికల్ సెంటర్‌లో తుదిశ్వాస విడిచాడు.

పోలీసులు తెలిన వివరాల ప్రకారం.. యూసుఫ్ తన సోదరుడితో ఫోన్‌లో మాట్లాడుతూనే, ప్రయాణికుడిని కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో తనకు ‘మహమ్మద్’ అనే పేరు నచ్చదని ప్రయాణికుడు చెప్పినట్లు యూసుఫ్ సోదరుడు కోర్టు పత్రాల్లో వెల్లడించాడు. కొద్దిసేపటి తర్వాత యూసుఫ్ సోమాలి భాషలో కేకలు వేస్తూ తనను సీటు బెల్టుతో గొంతు నులిమి, కారుతో తొక్కిస్తున్నారని చెప్పినట్లు తెలిపాడు. ఈ దాడి అనంతరం యూసుఫ్‌ను అతడి కారుతో తొక్కించి, పక్కనే ఉన్న గోతిలో వదిలేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో సమిత్ అపూర్వ పటేల్‌పై తొలుత హత్యాయత్నం, కారు దొంగతనం అభియోగాలు నమోదయ్యాయి.

మరోవైపు ఈ ఘటన ముస్లిం, సోమాలి సమాజాల్లో ఆందోళన కలిగించింది. అయితే ఈ దాడి మతపరమైన విద్వేషంతోనే జరిగిందని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని కౌంటీ అటార్నీ గతంలో పేర్కొన్నారు. యూసుఫ్ 1993లో అమెరికాకు వచ్చారని, చాలా ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారని ఆయన పెద్ద కుమారుడు ముస్తఫా ఉస్మాన్ తెలిపారు. ఆయనకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. దాడి తర్వాత యూసుఫ్‌కు ఐదుసార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. నిందితుడి తరఫు న్యాయవాది ఈ విషాద మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, కేసు విచారణ పూర్తయ్యే వరకు  ఎవరూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కోరారు. 

ఇదీ చదవండి: స్మార్ట్‌ గ్లాసెస్‌తో చోరీ చేసి, దొరికిపోయాడిలా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement