లేని బెర్తుకు కన్ఫర్మ్ టికెట్.. బిత్తరపోయిన ‍ప్రయాణికుడు! | Indian Railways allots seat 54 in coach with just 52 berths | Sakshi
Sakshi News home page

లేని బెర్తుకు కన్ఫర్మ్ టికెట్.. బిత్తరపోయిన ‍ప్రయాణికుడు!

Nov 28 2026 1:21 PM | Updated on Nov 28 2026 1:21 PM

Indian Railways allots seat 54 in coach with just 52 berths

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో వింత పొరపాటు వెలుగు చూసింది. మొత్తం 52 బెర్తులు మాత్రమే ఉన్న ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడికి 54వ నంబర్ బెర్తును కేటాయించారు. కన్ఫర్మ్ టికెట్ చేతిలో ఉన్నా.. కోచ్‌లో ఆ నంబర్ బెర్తు లేకపోవడంతో ప్రయాణికుడు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఈ గందరగోళం తలెత్తినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

వారణాసి సిటీ నుంచి నేపాల్‌గంజ్ రోడ్ వెళ్లే 15132 నంబర్ రైలులో ఈ ఘటన జరిగింది. ఇషాన్ బాజ్‌పేయి అనే ప్రయాణికుడు నవంబర్ 22న ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఆయనకు ఏసీ 2 టైర్ కోచ్‌లోని A1/54 బెర్తు కేటాయించారు. అయితే ఆ కోచ్‌లో మొత్తం 52 బెర్తులు మాత్రమే ఉండటంతో 54వ బెర్తు ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడ్డారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఇషాన్ బాజ్‌పేయి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో వీడియో రూపంలో పంచుకున్నారు. తన కన్ఫర్మ్ టికెట్ స్క్రీన్‌షాట్‌ను కూడా పోస్టు చేశారు. అందులో CNF/A1/54/SU అని ఉండటంతో A1 కోచ్‌లో 54వ సైడ్ అప్పర్ బెర్తు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. రాత్రి 10.45 గంటల సమయంలో ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఈ విషయం తెలిసిందని ఆయన తెలిపారు.

ఈ సమస్యపై రైల్వే హెల్ప్‌లైన్ 139కు ఫిర్యాదు చేసినట్లు బాజ్‌పేయి వెల్లడించారు. రైల్వే సేవ, రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులను ట్యాగ్ చేస్తూ సమాధానం కోరారు. దీనిపై స్పందించిన రైల్వే సేవ అధికారిక ఖాతా.. ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపినట్లు తెలిపింది. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. రైల్‌ మదద్ పోర్టల్ లేదా 139 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించింది. ఈ ఘటనపై నార్త్ ఈస్టర్న్ రైల్వే స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు అంగీకరించింది. ఈ సమస్యతో బాజ్‌పేయి ఒక్కరే కాకుండా మరో ప్రయాణికుడు కూడా ఇబ్బంది పడినట్లు వారణాసి డివిజన్ ప్రతినిధి వెల్లడించారు. ఇద్దరికీ అదే రైలులో ప్రత్యామ్నాయ బెర్తులను కేటాయించినట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగానే అందుబాటులో లేని బెర్తులకు కేటాయింపులు జరిగాయని, సమస్యను సరిదిద్దేందుకు సంబంధిత విభాగాన్ని అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గోల్‌ కొట్టి గాయపడిన మమ్దానీ.. వెంటనే శస్త్రచికిత్స!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement