గిరి ప్రదక్షిణలో అనంత్ అంబానీ సందడి! | Anant Ambani takes Govardhan parikrama | Sakshi
Sakshi News home page

గిరి ప్రదక్షిణలో అనంత్ అంబానీ సందడి!

Nov 28 2026 12:06 PM | Updated on Nov 28 2026 12:06 PM

Anant Ambani takes Govardhan parikrama

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ను సందర్శించారు. గోవర్ధన గిరి ప్రదక్షిణలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం, దేశ ప్రజల సంక్షేమం కోసం భగవంతుడిని ప్రార్థించారు. ఆయన రాకతో బ్రజ్ ప్రాంతంలో సందడి నెలకొంది. భక్తులు, స్థానికులు సంప్రదాయ పద్ధతిలో అనంత్ అంబానీకి స్వాగతం పలికారు.

గిరిరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు
తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా అనంత్ అంబానీ తొలుత గిరిరాజ్ ముఖారవింద్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గోవర్ధన పర్వతం చుట్టూ పూర్తి ప్రదక్షిణ చేపట్టారు. ఈ సందర్భంగా మార్గం మధ్యలోని పలు ప్రాంతాల్లో భక్తులు ఆయనకు స్వాగతం పలికారు.

కృష్ణలీల ప్రదర్శనలను తిలకించిన అనంత్
గోవర్ధన ప్రదక్షిణ మార్గంలో స్థానిక కళాకారులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి జీవితంలోని ఘట్టాలను ప్రతిబింబించేలా కృష్ణలీల ప్రదర్శనలు ఇచ్చారు. అనంత్ అంబానీ ఆసక్తిగా ఈ ప్రదర్శనలను తిలకించారు. బ్రజ్ ప్రాంతానికి శ్రీకృష్ణుడితో ఉన్న అనుబంధాన్ని, అక్కడి భక్తి సంప్రదాయాలను ఈ కార్యక్రమాలు చాటిచెప్పాయి.

తాతయ్య, నానమ్మ ఆశీర్వాదంతోనే ఇక్కడికి వచ్చా..
తన ఆధ్యాత్మిక అనుభూతిని వివరిస్తూ అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిరిరాజ్ ధరణ్ పాదాల చెంత ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. తన తాతయ్య, నానమ్మల వల్లే తాను ఇక్కడికి రాగలిగానని తెలిపారు. తాను గోవర్ధన ప్రదక్షిణకు వస్తున్నట్లు చెప్పినప్పుడు వారు ఎంతో సంతోషించారని వెల్లడించారు. వారి తరఫున కూడా స్వామివారికి నమస్కరించుకుంటున్నట్లు చెప్పారు.
 

దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు
బ్రజ్ ప్రాంతంలో కనిపించిన భక్తి వాతావరణం మాటల్లో చెప్పలేనిదని అనంత్ అంబానీ అన్నారు. ప్రతి ఒక్కరి శ్రేయస్సుతో పాటు భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని, దేశ ప్రజలందరికీ మేలు జరగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

అంబానీ కుటుంబానికి ఆలయ పూజారి ఆశీర్వాదం
అనంత్ అంబానీ పర్యటనపై శ్రీ గిరిరాజ్ జీ ఆలయ పూజారి గణేశ్ సంతోషం వ్యక్తం చేశారు. అంబానీ కుటుంబానికి గిరిరాజ్‌తో చాలా కాలంగా అనుబంధం ఉందని తెలిపారు. ఆయన తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మలు కూడా ఆలయాలకు విరాళాలు, కానుకలు సమర్పించారని పేర్కొన్నారు. అంబానీ కుటుంబానికి మరింత కీర్తి, ఐశ్వర్యం కలగాలని ఆశీర్వదించారు.

గోవర్ధన ప్రదక్షిణకు ప్రత్యేకత ఏమిటి?
హిందూ పురాణాల ప్రకారం.. బ్రజ్ ప్రాంత ప్రజలను ఇంద్రుడి ఆగ్రహం నుంచి రక్షించేందుకు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టారు. ఈ ఘట్టానికి గుర్తుగా గోవర్ధన పూజ నిర్వహిస్తారు. గోవర్ధన పర్వతం చుట్టూ సుమారు 21 కిలోమీటర్ల మేర సాగే ప్రదక్షిణకు ఏడాది పొడవునా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రదక్షిణను పూర్తి చేయడం భక్తులు పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యంగా భావిస్తారు.

ఇదీ చదవండి: ‘థాంక్స్‌ గివ్వింగ్‌’ స్ఫూర్తితో 29 వేల కుటుంబాలకు ఆహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement