రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ శుక్రవారం వృందావనానికి వచ్చారు. పవిత్రమైన గోవర్ధన గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు మార్గమధ్యంలోని పలు ప్రాంతాల్లో భక్తులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. తొలుత శ్రీ గిరిరాజ్ జీ ముఖారవింద్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత్.. అనంతరం గిరిరాజ్ జీగా పిలిచే గోవర్ధన పర్వతానికి పూర్తి ప్రదక్షిణ చేశారు.
ప్రదక్షిణ మార్గమంతా బ్రజ్ ప్రాంతానికి చెందిన గొప్ప సాంస్కృతిక, భక్తి సంప్రదాయాలు ప్రతిబింబించాయి. స్థానిక కళాకారులు శ్రీకృష్ణుడి దివ్య లీలలను ఆవిష్కరిస్తూ కృష్ణలీల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలను అనంత్ అంబానీ ఆసక్తిగా తిలకించారు. తన ఆధ్యాత్మిక అనుభూతి గురించి అనంత్ అంబానీ మాట్లాడుతూ.. "నేను గిరిరాజ్ ధరన్‌కు పూర్తి ప్రదక్షిణ చేస్తున్నాను. భగవాన్ గిరిరాజ్ ధరన్ పాదాల చెంత ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. బ్రజ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి నా తాతయ్య, నానమ్మలే కారణం. వారి ఆశీస్సులు, ప్రేమ, మార్గదర్శకత్వమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి అని అన్నారు.


