బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు తదితర రూపాల్లో పేరుకుపోతున్న క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను గుర్తించి, వాటిని తిరిగి పొందేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు చేపట్టిన చర్యలు ప్రధాన సమస్యలను పరిష్కరించాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై సుచేతా దలాల్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ముగించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
మృతుల కుటుంబ సభ్యులు, చట్టబద్ధ వారసులు తమకు తెలియని ఆర్థిక ఆస్తులను గుర్తించి, వాటిని క్లెయిమ్ చేసుకునే ప్రక్రియను సులభతరం చేయాలని పిటిషనర్ కోరారు. బ్యాంకు డిపాజిట్లు, బీమా మొత్తాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, పోస్టాఫీస్ డిపాజిట్లు వంటి వివిధ విభాగాల్లో ఉన్న నిధుల వివరాలను ఒకే చోట తెలుసుకునే వ్యవస్థ ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం, ఆర్‌బీఐ, సెబీ తదితర సంస్థలు ఇప్పటికే పలు నియంత్రణ, పరిపాలనా చర్యలు చేపట్టిన నేపథ్యంలో ప్రత్యేక న్యాయ ఆదేశాలు అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, ఆస్తులను గుర్తించడం, వాటిని తిరిగి పొందడం వంటి ప్రక్రియల్లో పారదర్శకత, సామర్థ్యం, ప్రజలకు అందుబాటు మరింత మెరుగుపడాలని అధికారులను ఆదేశించింది. ఈ సమస్యను వెలుగులోకి తెచ్చిన పిటిషనర్ సుచేతా దలాల్ కృషిని ధర్మాసనం అభినందించింది.
అన్ని ఆస్తులకు ఒకే పోర్టల్ తప్పనిసరి కాదు
అన్ని రకాల ఆర్థిక ఆస్తుల కోసం ఒకే సమగ్ర పోర్టల్‌ను ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తప్పనిసరి చేయలేదు. బ్యాంకింగ్, సెక్యూరిటీస్, బీమా తదితర రంగాలు వేర్వేరు చట్టాలు, నియంత్రణ వ్యవస్థల పరిధిలో పనిచేస్తున్నాయని పేర్కొంది. ఆస్తుల యాజమాన్యాన్ని నిర్ధారించడం, వారసత్వ హక్కులను పరిశీలించడం, నిధులను బదిలీ చేయడం వంటి అంశాల్లో విభాగాలవారీగా ప్రత్యేక విధానాలు అవసరమని వివరించింది. అయితే, ఈ రంగాల మధ్య సమన్వయం పెరగడం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. నిర్దిష్ట ఆర్థిక ఆస్తికి సంబంధించి ఎవరికైనా సమస్య ఎదురైతే సంబంధిత అధికారులను చట్ట ప్రకారం సంప్రదించవచ్చని స్పష్టం చేసింది.
అందుబాటులోకి ఆర్థిక ఆస్తుల అన్వేషణ
క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లను గుర్తించేందుకు ఆర్‌బీఐ అభివృద్ధి చేసిన ఉద్గమ్ (Unclaimed Deposits – Gateway to Access Information) పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వేదిక ద్వారా పలు బ్యాంకుల్లో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఒకే చోట తెలుసుకోవచ్చు. అయితే, నిధులను నేరుగా ఈ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేయలేరు. సంబంధిత బ్యాంకును సంప్రదించి అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
బీమా మొత్తాలను గుర్తించేందుకు ఐఆర్‌డీఏఐ ఆధ్వర్యంలో బీమా భరోసా పోర్టల్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం సెబీ ఆధ్వర్యంలో ‘మిత్రా’ వేదికలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, డివిడెండ్లకు సంబంధించి ‘ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ’ పోర్టల్ ద్వారా వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 12 ఏళ్లుగా గుట్టుగా గోల్డ్‌లో పెట్టుబడి.. తల్లిదండ్రులు షాక్!


