సొంత వ్యాపారమే భారతీయుల ఆకాంక్ష | Indians Want to Start Own Business LinkedIn Report | Sakshi
Sakshi News home page

సొంత వ్యాపారమే భారతీయుల ఆకాంక్ష

Nov 27 2026 5:30 PM | Updated on Nov 27 2026 5:44 PM

Indians Want to Start Own Business LinkedIn Report

ప్రతి పది మందిలో ఎనిమిదికి వ్యాపార వాంఛ

ప్రపంచ సగటు కంటే దాదాపు రెట్టింపు

జెన్‌ జెడ్‌లో 94 శాతం మందికి ఆసక్తి

ఏఐ, డిజిటల్‌ సాధనాలతో కొత్త అవకాశాలు

ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ లింక్డ్‌ఇన్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: భారతీయుల్లో సొంత వ్యాపార ఆకాంక్ష గణనీయంగా పెరుగుతోంది. ప్రతి పది మందిలో ఎనిమిది మందికి పైగా (ఏకంగా 85%) సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఈ సంఖ్య ప్రపంచ సగటు కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లింక్డ్‌ఇన్‌ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఆ్రస్టేలియా దేశాల్లోని 12,000 మందితో పాటు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు, చిన్న వ్యాపార యజమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. ఇందులో మరిన్ని అంశాలు...  

  •     సొంత వ్యాపారం ప్రారంభించాలన్న ఆసక్తి జెన్‌ జెడ్‌ తరంలో 94 శాతం మందికి, మిలీనియల్స్‌లో 90 శాతం మందికి ఉందని సర్వేలో తేలింది. జెన్‌ జెడ్‌కు చెందిన వారిలో 70 శాతం మంది వచ్చే మూడేళ్లలో వ్యాపారం లేదా అదనపు ఆదాయాన్నిచ్చే ‘సైడ్‌ హస్టిల్‌’ ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ విషయంలో మహిళలు, పురుషుల ఆకాంక్షల్లో పెద్దగా తేడా లేదు. రానున్న కొన్నేళ్లలో వ్యాపారం ప్రారంభిస్తామని 91 శాతం మహిళలు, 94 శాతం పురుషులు వెల్లడించారు.  

  •     వ్యాపార ప్రారంభంపై ఆసక్తి కేవలం ఆలోచనలకే పరిమితం కావడం లేదు. 2022 నుంచి లింక్డ్‌ఇన్‌ ప్రొఫైళ్లలో ‘ఫౌండర్‌’ (వ్యవస్థాపకుడు) అనే హోదాను చేర్చుకున్న సభ్యుల సంఖ్య 190 శాతం పెరిగింది. జెన్‌ జెడ్‌లో ఈ పెరుగుదల ఏకంగా 383 శాతంగా నమోదైంది.  

  •     డిజిటల్‌ సాధనాలు, కృత్రిమ మేధ (ఏఐ) చిన్న వ్యాపారాల వృద్ధికి దోహదపడుతున్నాయని నివేదిక తెలిపింది. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు వ్యాపారవేత్తలుగా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని 86 శాతం మంది భారతీయులు విశ్వసిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా కస్టమర్లను చేరుకునే వీలు (74%), వ్యాపార పట్ల అవగాహన సులభంగా లభించడం (63%) ఇందుకు దోహదపడుతున్నాయి.  

  •     చిన్న వ్యాపార వ్యవస్థాపకుల్లో పది మందిలో తొమ్మిది మందికి పైగా ఏఐని వినియోగిస్తున్నారు. ఏఐ, డిజిటల్‌ సాధనాల వల్ల కొత్త ఉత్పత్తులు, సేవలను అందించగలిగామని చెప్పిన వారిలో 36 శాతం మంది ఉన్నారు. ఏఐ వినియోగం లేకపోతే తమ వ్యాపారాలకు మరింత పెట్టుబడి అవసరమయ్యేదని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు.  

వ్యాపార విప్లవ దశలో భారత్‌  
‘‘భారత్‌ ప్రస్తుతం వ్యాపార విప్లవ దశలో ఉంది. సొంత వ్యాపారం ప్రారంభించడం అనేది వృత్తికి దూరంగా వేసే అడుగు కాదు. లక్షలాది మందికి అది వారి కెరీర్‌లో భాగంగా మారుతోంది. కొత్త వ్యాపార ప్రయత్నాల వ్యయాన్ని ఏఐ తగ్గిస్తున్నప్పటికీ, ఆలోచనను వ్యాపారంగా మార్చేది మాత్రం మనుషులే. తొలి అవకాశాన్ని కల్పించే నెట్‌వర్క్, అత్యుత్తమ సేవలను అందించే బృందం, నమ్మకంతో ముందుకొచ్చే వినియోగదారులే విజయానికి కీలకం’’ అని లింక్డ్‌ఇన్‌ ఇండియా మేనేజర్‌ కుమరేష్‌ పట్టాభిరామన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement