అత్తకు రూ.6000 కోట్లు ఇచ్చేదే లేదు! | Sunjay Kapur 6000 Cr Trust Row Rani Kapur Settlement Offer Priya Sachdev Response | Sakshi
Sakshi News home page

అత్తకు రూ.6000 కోట్లు ఇచ్చేదే లేదు!

Nov 27 2026 3:58 PM | Updated on Nov 27 2026 4:14 PM

Sunjay Kapur 6000 Cr Trust Row Rani Kapur Settlement Offer Priya Sachdev Response

సంజయ్‌ కపూర్ కుటుంబ ట్రస్ట్‌ వివాదం

మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ముగింపు

దివంగత పారిశ్రామికవేత్త, సోనా కామ్‌స్టార్ మాజీ ఛైర్మన్ సంజయ్‌ కపూర్ కుటుంబ వారసత్వ ఆస్తుల వివాదం సుదీర్ఘ న్యాయపోరాటానికి దారితీసింది. సుమారు రూ.30,000 కోట్ల విలువైనదిగా అంచనా వేస్తున్న ‘ఆర్‌కే ఫ్యామిలీ ట్రస్ట్’ నిర్వహణ, ఆస్తుల పంపిణీ విషయంలో ఆయన తల్లి రాణి కపూర్, భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్ మధ్య జరిగిన రాజీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలో 15 విడతలుగా సాగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యవర్తిత్వ ప్రక్రియను అధికారికంగా ముగించింది. ఒకరిపై ఒకరు రాజీని బలవంతంగా రుద్దలేరని ధర్మాసనం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా, ట్రస్ట్‌పై తన క్లెయిమ్‌ల పరిష్కారానికి రూ.6,000 కోట్లు చెల్లించాలని రాణి కపూర్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే ప్రతిపాదించారు. అయితే, రాణి కపూర్ ట్రస్ట్‌లో ఎటువంటి వాటాకు అర్హురాలు కాదని ప్రియా కపూర్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తన సమ్మతి, పూర్తి అవగాహన లేకుండానే తన ఆస్తులను ట్రస్ట్‌లోకి బదిలీ చేశారని రాణి కపూర్ ఆరోపిస్తుండగా, ట్రస్ట్ నిర్మాణం పూర్తిగా చట్టబద్ధమైనదని ప్రియా కపూర్ పక్షం సమర్థించుకుంటోంది. మరోవైపు, ట్రస్ట్‌లో తమకు 24 నుంచి 26 శాతం వాటా దక్కాలని సుంజయ్, నటి కరిష్మా కపూర్‌ల పిల్లలు సమైరా, కియాన్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ అంశాలపై కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

ఇదిలా ఉండగా, సుంజయ్ కపూర్ వ్యక్తిగత ఆస్తులు, 2025 మార్చి 21 నాటి వీలునామా చెల్లుబాటుపై సమైరా, కియాన్ దాఖలు చేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో విడిగా విచారణలో ఉంది. ఆ వీలునామా నకిలీదని పిల్లలు ఆరోపిస్తుండగా, ప్రియా కపూర్ దాన్ని సమర్థిస్తున్నారు. ఈ కేసులో 2026 ఏప్రిల్ 30న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తుది తీర్పు వెలువడే వరకు సుంజయ్ వ్యక్తిగత ఆస్తులను విక్రయించవద్దని, విదేశీ, బ్యాంకు ఖాతాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వం ముగియడంతో, ఇకపై ట్రస్ట్ ఆస్తుల పరిరక్షణ, యాజమాన్య హక్కులపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయపోరాటం కొనసాగనుంది.

ఇదీ చదవండి: బ్లింకిట్‌కు రూ.11 లక్షల ఫైన్‌.. జెప్టో, బిగ్‌బాస్కెట్‌ లైసెన్సుల రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement