ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రముఖ ఈవీ స్టార్టప్ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ భారీ విస్తరణకు సిద్ధమైంది. తమిళనాడులోని హోసూర్ సమీపంలో రూ.779 కోట్ల పెట్టుబడితో కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగానే.. శూలగిరిలోని సిప్‌కాట్ ఇండస్ట్రియల్ పార్క్‌లో బిగ్గా (బిగ్ గ్లోబల్ యాంబిషన్) పేరుతో ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది.
ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఏడాదికి 2.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు పెంచనుంది. ఈ కొత్త ప్లాంట్‌లో కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లను తయారు చేయనుంది.
కంపెనీ ప్లాన్ ఇదే
ముఖ్యంగా టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, షాక్‌వేవ్ మోటార్‌సైకిల్ ఉత్పత్తికి ఈ ఫ్యాక్టరీ ఉపయోగపడనుంది. అంతేకాకుండా.. స్పోర్ట్స్, క్రాసోవర్, క్రూయిజర్, స్ట్రీట్ విభాగాల్లోనూ కొత్త బైక్‌లను తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న తయారీ కేంద్రానికి అదనంగా ఈ హోసూర్ ప్లాంట్ పనిచేయనుంది. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో భాగంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
కొత్త బైకుతో సీఎం విజయ్
ఈ కార్యక్రమంలో ఆల్ట్రావయొలెట్ కొత్త బైక్ ఎక్స్-47 వెనమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోసూర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి విజయ్ కూడా ఈ బైక్‌ను పరిశీలించారు. కంపెనీ భవిష్యత్తులో తీసుకురానున్న ఎలక్ట్రిక్ బైక్‌లకు ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ తమ బైక్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ఆల్ట్రావయొలెట్ భావిస్తోంది.
2000 మందికి ఉపాధి
ఈ ప్లాంట్ వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరగనున్నాయి. కంపెనీ అంచనా ప్రకారం.. సుమారు 2,000 మందికి ఉపాధి లభించనుంది. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఫ్యాక్టరీలో రోబోటిక్స్, ఆటోమేషన్, డిజిటల్ క్వాలిటీ చెకింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. దీంతో వాహనాల తయారీ మరింత వేగంగా, నాణ్యతతో జరిగే అవకాశం ఉంది.


