ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఐటీ నిపుణులకు షాక్ ఇచ్చింది. తన కన్సల్టింగ్ విభాగంలోని చాలా ఉద్యోగాలకు ఇకపై హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డుల స్పాన్సర్‌షిప్ ఇవ్వకూడదని నిర్ణయించింది. దీంతో.. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది విదేశీయుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై పనిచేస్తూ, గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ నిర్ణయం సమస్యగా మారే అవకాశం ఉంది.
ఐబీఎం తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీలోనే అతిపెద్ద విభాగమైన ఐబీఎం కన్సల్టింగ్‌కు వర్తించనుంది. ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే.. ఈ కొత్త విధానం వల్ల ఎంతమంది ఉద్యోగాలు లేదా వీసా స్పాన్సర్‌షిప్‌పై ప్రభావం పడుతుందనే వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అమెరికాలో ఉద్యోగం కొనసాగించాలంటే.. వీసా స్పాన్సర్‌షిప్ అవసరమయ్యే విదేశీ ఉద్యోగులకు మాత్రం ఈ పరిణామం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.
ఉద్యోగులకు మూడు వారల గడువు
ప్రభావిత ఉద్యోగులు తమ నిర్ణయాన్ని చెప్పడానికి కంపెనీ మూడు వారాల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉండటానికి బదులుగా ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగం కొనసాగించే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. అందుకు అంగీకరించని ఉద్యోగులకు మూడు నెలల జీతానికి సమానమైన సెవరెన్స్ ప్యాకేజీ ఇచ్చి కంపెనీ నుంచి పంపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు హెచ్-1బీ వంటి హైస్కిల్డ్ వీసా కార్యక్రమాలపై ఆధారపడ్డామని, అయితే.. గత కొన్నేళ్లుగా వాటిపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నట్లు సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. మారుతున్న వ్యాపార అవసరాలు, ఉద్యోగుల లభ్యతలో వస్తున్న మార్పులే ఈ నిర్ణయానికి కారణమని వివరించారు. అయితే కంపెనీ తీసుకున్న నిర్ణయం.. ఎంతమంది భారతీయ ఉద్యోగులపై ప్రభావం చూపుతుందనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: షాకిస్తున్న ధరలు.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి!


