భారత పారా ఆర్చరీ క్రీడాకారిణి శీతల్ దేవికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. 2026 ఆసియా పారా గేమ్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించినందుకు గుర్తింపుగా కంపెనీ సరికొత్త కారును గిఫ్ట్‌గా అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నవంబర్ 25న గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో శీతల్ దేవికి హ్యుందాయ్ కంపెనీ బయాన్ కారును అందించింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో.. దేశానికి పేరు తీసుకొచ్చిన ఆమెను ఈ సందర్భంగా కంపెనీ ప్రత్యేకంగా అభినందించింది.
2026 ఆసియా పారా గేమ్స్‌లో శీతల్ దేవి తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ బంగారు పతకాలు సాధించారు. మిక్స్‌డ్ టీమ్‌లో తోమన్ కుమార్‌తో కలిసి విజయం సాధించగా, మహిళల కాంపౌండ్ డబుల్స్‌లో పాయల్ నాగ్‌తో కలిసి రజత పతకం గెలుచుకున్నారు. ఇలా మొత్తం మూడు పతకాలతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె పట్టుదల, కృషిని గుర్తించిన హ్యుందాయ్ ఈ కారును గిఫ్ట్ ఇచ్చింది.
శీతల్ దేవికి హ్యుందాయ్‌తో అనుబంధం కూడా ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎందుకంటే.. 2026 సెప్టెంబర్‌లో ఆమెను కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ప్రకటనలు, సామాజిక కార్యక్రమాలు, దివ్యాంగులకు అందుబాటులో ఉండే సౌకర్యాల అభివృద్ధి వంటి కార్యక్రమాల్లో ఆమె భాగస్వామి కానున్నారు. హ్యుందాయ్ నిర్వహిస్తున్న 'సమర్థ్' కార్యక్రమం ద్వారా పారా అథ్లెట్లకు ప్రోత్సాహం అందిస్తోంది. ఈ గిఫ్ట్ ద్వారా క్రీడాకారుల ప్రతిభను గౌరవించడంతో పాటు సమాజంలో సమాన అవకాశాల ప్రాధాన్యతను కూడా కంపెనీ చాటిచెప్పింది.
ఇక శీతల్ దేవికి గిఫ్ట్‌గా ఇచ్చిన హ్యుందాయ్ బయాన్ విషయానికి వస్తే, ఈ కారు 2026 అక్టోబర్ 26న భారత మార్కెట్లో విడుదలైంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.9,99,900. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 115 హెచ్‌పీ పవర్, 143.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, ఐవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
వేరియంట్‌ను బట్టి 12.3 అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే.. శీతల్ దేవికి అందించిన కారులో ప్రత్యేక డ్రైవింగ్ కంట్రోల్స్ లేదా ఆమె అవసరాలకు అనుగుణంగా ఇతర మార్పులు చేశారా? లేదా? అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
ఇదీ చదవండి: రూ.206 కోట్ల బంగారం.. శ్రీవారికి సమర్పించిన వ్యక్తి ఎవరో తెలుసా?


