Photo Credit: Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా భారత్ పోరాటం సెమీస్‌లో ముగిసిన సంగతి తెలిసిందే. బుధవారం శ్రీలంకతో జరిగిన సెమీస్‌లో ఇండియా-ఎ జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మ్యాచ్ ఓటమి అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ.. బౌలింగ్ వైఫల్యం జట్టు కొంపముంచిందని పేర్కొన్నాడు.
తిలక్ వర్మ మాట్లాడుతూ.. 'నిజాయితీగా చెప్పాలంటే.. బోర్డుపై 320-330 పరుగులు చేస్తే మంచి స్కోర్ అవుతుందని భావించాం. కానీ 20 ఓవర్ల తర్వాత పిచ్ కొంచెం నెమ్మదించింది. ఆరంభంలో 20 ఓవర్ల పాటు బంతి ఈజీగా బ్యాట్‌పైకి వచ్చింది. కానీ ఆ తర్వాత పిచ్ కొద్దిగా స్లో అయింది. కొన్ని బంతులు గ్రిప్ అవుతూ.. తక్కువ ఎత్తులో వచ్చాయి. ఆ సమయంలోనే మేం వరుసగా మూడు వికెట్లు కోల్పోయాం. ఆ తర్వాత తనూష్ కోటియన్, షాబాజ్ ఆడిన తీరు వల్ల 317 పరుగుల భారీ స్కోర్ చేయగలిగాం.
మా బౌలింగ్ సమయంలో తొలి 15 ఓవర్లు చాలా కీలకమని మా బౌలర్లకు చెప్పాను. వారిని ఓవర్‌కు 6 పరుగుల్లోనే కట్టడి చేయాలని సూచించాను. ఆ తర్వాత పిచ్ నెమ్మదిస్తుందని, అప్పుడు పై చేయి సాధించవచ్చని చెప్పాం. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రణాళికలను మేం అమలు చేయలేకపోయాం.
శ్రీలంక ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. ఈ గెలుపు క్రెడిట్ వారికే దక్కుతుంది. ఇద్దరు ఓపెనర్లు చాలా బాగా ఆడారు. కానీ వారిని ఔట్ చేసేందుకు నేను చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఇది మాకు చెడ్డ రోజు. బౌలర్ల నుంచి నాకు ఎలాంటి సహకారం లభించలేదు. అయినా పర్వాలేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. కానీ శ్రీలంక బ్యాటర్లను మెచ్చుకోవాల్సిందే.
ఈ మ్యాచ్ ఓడినా.. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. చాలా మంది యువ ఆటగాళ్లు తొలిసారి ఈ టోర్నీ ఆడుతున్నారు. ముఖ్యంగా షాబాజ్ అహ్మద్, తనూష్ కోటియన్ అద్భుతంగా ఆడారు. షాబాజ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో కూడా మా కుర్రాళ్లు బాగా రాణించారు. కానీ బౌలింగ్ విభాగమే ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. మా బౌలింగ్ ప్రదర్శనపై ఆత్మపరిశీలన చేసుకుంటాం. మరింత బలంగా తిరిగి వస్తాం.' అని తిలక్ వర్మ తెలిపాడు.
ఇదీ చదవండి: ILT20: విండీస్ స్టార్ విధ్వంసం.. చిత్తుగా ఓడిన నైట్‌రైడర్స్


