న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని యాజమాన్యంలోని ‘మాహీ క్లచర్స్’ ఈ–స్పోర్ట్స్ జట్టు, మోబా లెజెండ్స్ మాస్టర్స్ సిరీస్ సీజన్–2లో బరిలోకి దిగనుంది. శుక్రవారం నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొబైల్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు గూగుల్ ప్లే, నాడ్విన్ గేమింగ్ సంయుక్తంగా ప్రారంభించిన ‘గూగుల్ ప్లే ఎరీనా’వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో ‘మహీ క్లచర్స్’తో పాటు దేశంలోని ప్రముఖ ఈ–స్పోర్ట్స్ జట్లు అయిన ఎస్8యుఎల్ ఈ–స్పోర్ట్స్, గాడ్‌లైక్ ఈ–స్పోర్ట్స్, ఒరంగుటాన్, టీమ్ అపెక్స్ గేమింగ్, రెవెనెంట్ ఎక్స్‌స్పార్క్, క్రక్స్ రెక్వియమ్, షాడో ఈ–స్పోర్ట్స్ జట్లు కూడా పోటీపడుతున్నాయి.
మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ నెల 30 వరకు రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ అనంతరం రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఒక్కో జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘లాస్ట్ ఛాన్స్ క్వాలిఫయర్’ అడనున్నాయి. నాలుగో స్థానంలో నిలిచిన జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
డిసెంబర్ 10న జరిగే ‘లాస్ట్ చాన్స్ క్వాలిఫయర్’ దశలో ఆరు జట్లు తలపడనుండగా, ఇందులో గెలిచిన రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయి. డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే ఫైనల్స్‌లో నాలుగు జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. లెజెండ్స్ మాస్టర్స్ సిరీస్ తొలి సీజన్‌లో ‘ట్రూ రిప్పర్స్’ జట్టు విజేతగా నిలిచి, పారిస్‌లో జరిగిన ఈ–స్పోర్ట్స్ వరల్డ్ కప్–2026లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.


