ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జరిగిన ఓ టీ20 లీగ్‌లో అనుమతి లేకుండా పాల్గొన్న ముగ్గురు స్వదేశీ క్రికెటర్లపై నాలుగు నెలల నిషేధం విధించింది. నిషేధానికి గురైన వారి పేర్లు సమీవుల్లా షిన్వారి, అఫ్తాబ్ ఆలం, మొహమ్మద్ షెహజాద్. వీరు భారత్‌లో ఇటీవల జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో సొంత దేశ క్రికెట్ బోర్డు అనుమతి లేకుండా ఆడారు.
వీరు బోర్డు నుంచి 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండింది. అయితే వీరు అలా చేయలేదు. దీంతో బోర్డు ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంది.
ఈ నాలుగు నెలల కాలంలో షిన్వారి, ఆఫ్తాబ్, షెహజాద్ దేశీయ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఎక్కడా క్రికెట్ ఆడలేరు. నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ శిక్ష విధించినట్లు ఆఫ్ఘన్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు ఐసీసీ లేదా బీసీసీఐ అధికారిక గుర్తింపు లేదని, అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉందని ఆఫ్ఘన్ బోర్డు అభిప్రాయపడింది.
ఈ లీగ్‌లో మరో ఆఫ్ఘన్ ఆటగాడు, ఆ దేశ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ కూడా పాల్గొన్నప్పటికీ, అతను ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అందుకే అతనిపై చర్యలు తీసుకోలేదని బోర్డు వివరణ ఇచ్చింది.
కాగా, ACB ఇటీవలే తమ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు ఏడాదిలో గరిష్టంగా మూడు విదేశీ లీగ్‌లలో మాత్రమే పాల్గొనేలా పరిమితులు విధించింది. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి స్టార్ ఆటగాళ్లపై కూడా ఈ నిబంధన ప్రభావం చూపింది.


