అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి బరిలోకి
న్యూఢిల్లీ: క్రికెట్‌లో వెల్లువలా వస్తున్న టి20 లీగ్‌ల జాబితాలో మరో టోర్నీ చేరనుంది. అయితే ఇది ఇప్పటి దాకా మనం చూస్తున్న టోర్నీలకంటే కాస్త భిన్నమైనది. పురుషులకో, మహిళలకో పరిమితం కాకుండా వీరంతా కలిసి ఆడే అవకాశం ఇక్కడ ఉంటుంది. ‘ఈక్వల్’ పేరుతో ఈ కొత్త మిక్స్‌డ్ జెండర్ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నారు. పురుషుల, మహిళల ప్రొఫెషనల్ క్రికెటర్లంతా ఇందులో కలిసి ఒకే జట్టు తరఫున బరిలోకి దిగుతారు. యూరోప్‌లో ఈ టోర్నమెంట్ నిర్వహణకు జర్మనీ క్రికెట్ ఫెడరేషన్ (డీసీబీ) హక్కులు తీసుకుంది. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఈ టోర్నీ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
జర్మనీ క్రికెట్ ఫెడరేషన్‌తో ఒప్పందం చేసుకున్న జహీర్ ఖాన్ కంపెనీ యాంకర్ స్పోర్ట్స్ ఏబీ సంయుక్తంగా టోర్నీని నిర్వహించనుంది. ‘ఈక్వల్’ టోర్నీలో మొత్తం ఐదు జట్లతో కలిపి 12 టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రతీ టీమ్‌లో 18 మంది ప్లేయర్లు ఉంటారు. 11 మంది సభ్యుల తుది జట్టులో ఆరుగురు పురుష క్రికెటర్లు, ఐదుగురు మహిళా క్రికెటర్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. ‘ఇప్పుడిప్పుడే యూరోప్‌లో క్రికెట్ మార్కెట్ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త తరహా ఆటతో సామాన్యులకు చేరువ కావచ్చు. అందుకే మిక్స్‌డ్ జెండర్ టోర్నీని తీసుకొస్తున్నాం’ అని జహీర్ ఖాన్ వెల్లడించాడు.


