దోహా వేదికగా జరుగుతున్న మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో టీమిండియా కుర్రాళ్ల ప్రయాణం ముగిసింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఘనవిజయం సాధించిన లంక జట్టు.. ఫైనల్‌లో అడుగుపెట్టింది. 116 పరుగులు చేసిన లసిత్ క్రోస్‌పుల్లే 105 పరుగులు చేసిన సినిత్ జయవర్ధనే లంక గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 78, కెప్టెన్ తిలక్ వర్మ 53, షాబాజ్ అహ్మద్ 54, వైభవ్ సూర్యవంశీ 40 పరుగులు చేశారు. లంక బౌలర్లలో రవిందు, జనిత్, నిపున్ తలో 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష‍్య ఛేదనలో లంక కుర్రాళ్లు ఆడుతూ పాడుతూ మ్యాచ్ పూర్తిచేశారు. ఓపెనర్లు లసిత్ క్రోస్‌పుల్లే(116), సినిత్ జయవర్ధనే (105) తొలి వికెట్‌కి 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత సెంచరీ చేసిన సినిత్ జయవర్థనే ఔటవగా.. తర్వాత లసిత్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పవన్, నిషాన్ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో షాబాజ్, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు.
శుక్రవారం జరగబోయే మరో సెమీఫైనల్లో పాక్-బంగ్లాదేశ్ జట్లు తలపడబోతున్నాయి. ఇందులో గెలిచిన జట్టు.. ఆదివారం జరిగే ఫైనల్లో లంకతో తలపడనుంది.


