source: X
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా శ్రీలంక-ఎతో ఇవాళ జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత-ఎ జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. తొలి 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (27 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (63 బంతుల్లో 78; 11 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఔట్ కాగా.. తిలక్ వర్మ (32), కుమార్ కుషాగ్రా (2) క్రీజ్‌లో ఉన్నారు.
మరోసారి బ్యాట్ ఝులిపించిన వైభవ్
ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. యూఏఈతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించిన అతడు.. శ్రీలంక-ఎతో ఇవాళ జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఓ మోస్తరు విధ్వంసంతో సరిపెట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ భారీ విధ్వంసం ఖాయమనుకున్న తరుణంలో జనిత్ లియనాగే బౌలింగ్‌లో లసిత్ క్రూస్‌పుల్లేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
యూఏఈతో జరిగినమ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు డబుల్ సెంచరీ (53 బంతుల్లో 204; 7 ఫోర్లు, 28 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. ఈ విధ్వంసం ధాటికి లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, 150, డబుల్ సెంచరీ.. ఇలా చాలావరకు బ్యాటింగ్ రికార్డులు బద్దలయ్యాయి.
సత్తా చాటిన అభిషేక్
ఈ టోర్నీలో తనదైన మార్కు చూపించలేకపోయిన అభిషేక్, శ్రీలంకతో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో తన సహజ శైలిలో భిన్నంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు లహీరు సమరకూన్ బౌలింగ్‌లో జనిత్ లియనాగేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఇదీ చదవండి: మరోసారి బ్యాట్ ఝులిపించిన వైభవ్ సూర్యవంశీ


