కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కుల్దీప్ (ఫైల్ ఫొటో PC: BCCI X)
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తొలుత చోటు దక్కింది. అయితే, అనూహ్య రీతిలో తొలి టెస్టుకు ముందు టీమిండియా యాజమాన్యం అతడిని జట్టు నుంచి విడుదల చేసి.. ఇంటికి పంపింది.
గుర్నూర్ బ్రార్‌కు చోటు
కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ గుర్నూర్ బ్రార్‌ను టెస్టు జట్టులో చేర్చారు. ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా వెల్లింగ్‌టన్‌లో భారత్- కివీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా అయింది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలు కుల్దీప్ లేని లోటు గురించి ప్రస్తావిస్తూ భారత జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు.
దాదా అసహనం
విదేశీ గడ్డ మీద పిచ్ ఫ్లాట్‌గా మారే క్రమంలో నిఖార్సైన స్పిన్నర్ అవసరం ఉంటుందని.. యాజమాన్యం ఈ విషయాన్ని ఎలా మరిచిపోయిందని దాదా మండిపడ్డాడు. కుల్దీప్ యాదవ్ లేదంటే మానవ్ సుతార్‌లలో ఒకరిని ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ ఇష్ సోధి తాజాగా స్పందించాడు.
అతడొక అద్భుతమైన స్పిన్ బౌలర్
PTI ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భావోద్వేగాల పరంగా చూస్తే కుల్దీప్‌ను తప్పించడం అందరికీ బాధగానే ఉంటుంది. అతడి బౌలింగ్ అంటే నాకెంతో ఇష్టం. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో కుల్దీప్‌నకు ప్రత్యర్థిగా నేను ఆడాను. అతడు రోజురోజుకీ ఎదిగిపోయాడు.
అతడొక అద్భుతమైన స్పిన్ బౌలర్. అయితే, న్యూజిలాండ్ గడ్డ మీది పరిస్థితులు చూసుకుంటే.. ముఖ్యంగా రెండో టెస్టుకు వేదికైన హాగ్లే ఓవల్ మైదానంలో గత పదేళ్ల కాలంలో.. టెస్టు క్రికెట్‌లో స్పిన్నర్లు కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగారు.
అందుకే ముందుగానే కుల్దీప్‌ను సాగనంపారు!
ఈ మైదానం స్పిన్నర్లకు అస్సలు సహకరించదు. అందుకే ముందుగానే కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించి ఉంటారు. సెలక్టర్లు ఎందుకిలా చేశారో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ బ్యాటింగ్ చేయగల ఫింగర్ స్పిన్నర్‌కు మాత్రం కాస్త అవకాశం ఉంటుంది.
అందుకే వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాను ఎంపిక చేసి ఉంటారు. వీరిద్దరి బ్యాటింగ్ సగటు కూడా 40కి పైగానే ఉంది. అందుకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు.
హాగ్లే ఓవల్ పిచ్ కాస్త బౌన్సీగానే ఉంటుంది. ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌లో సీమ్ ఎక్కువగా ఉంటుంది’’ అని కివీస్ స్పెషలిస్టు రిస్ట్ స్పిన్నర్ ఇష్ సోధి పేర్కొన్నాడు. అందుకే ముందుగానే కుల్దీప్‌ను ఇంటికి పంపి ఉంటారని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్- కివీస్ మధ్య శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టుకు క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానం వేదిక.
ఇవీ చదవండి: రిషభ్ పంత్ విధ్వంసం.. 21 బంతుల్లోనే..
ఆ ఇద్దరిపై వేటు!.. కివీస్‌తో రెండో టెస్టుకు భారత తుదిజట్టు ఇదే!


