అతడు సూపర్‌ బౌలర్‌.. అరంగేట్రానికి సిద్ధమే: టీమిండియా కోచ్‌ | He Knocking on the doors: India coach on 26 Yo ahead of NZ vs IND 2nd Test | Sakshi
Sakshi News home page

అతడు సూపర్‌ బౌలర్‌.. అరంగేట్రానికి సిద్ధమే: టీమిండియా కోచ్‌

Nov 26 2026 10:46 AM | Updated on Nov 26 2026 11:06 AM

He Knocking on the doors: India coach on 26 Yo ahead of NZ vs IND 2nd Test

బ్రార్‌ (PC: BCCI X)

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదలయ్యే ఈ మ్యాచ్‌కు క్రైస్ట్‌చర్చ్‌ వేదిక. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. తొలి టెస్టులో సీనియర్లు రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌కు మొండిచేయి ఎదురైన సంగతి తెలిసిందే.

జడేజాకు బదులు యువ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను ఆడించిన యాజమాన్యం.. సిరాజ్‌ స్థానంలో అన్షుల్‌ కాంబోజ్‌కు పేస్‌ దళంలో చోటు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. రెండో టెస్టులోనూ వీరికి చోటు దక్కదని ఇప్పటికే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సంకేతాలు ఇచ్చాడు.

సెలక్షన్‌ మన చేతుల్లో లేదు
తాజాగా.. టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ మీడియాతో మాట్లాడుతూ.. సిరాజ్‌కు మరోసారి మొండిచేయి తప్పదని పరోక్షంగా చెప్పాడు. ‘‘సిరాజ్‌ బాగానే బౌలింగ్‌ చేస్తున్నాడు. అయితే కొన్నిసార్లు జట్టు ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు.

నేను అతడితో మాట్లాడాను. ‘ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్‌ను మరికాస్త మెరుగుపరచుకో. అయితే, సెలక్షన్‌ విషయం మాత్రం మన ఆధీనంలో లేదు’ అని చెప్పాను’’ అని మోర్నీ మోర్కెల్‌ తెలిపాడు. అదే సమయంలో యువ పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ ఈసారి టెస్టుల్లో అరంగేట్రం చేసే సూచనలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు.

అతడు సూపర్‌ బౌలర్‌.. అరంగేట్రానికి సిద్ధమే
‘‘గుర్నూర్‌ బ్రార్‌ సరైన చోట సరైన విధంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతడు టీమిండియా తలుపులు బాదుతున్నాడు. అతడి బౌలింగ్‌లో పేస్‌, బౌన్స్‌ ఉన్నాయి. కివీస్‌ పిచ్‌ పరిస్థితులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఎప్పుడు అవకాశం వచ్చినా రాణించేందుకు అతడిని సమాయత్తం చేయడమే కోచ్‌గా నా పని’’ అని మోర్నీ మోర్కెల్‌ అన్నాడు.

కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 12 వన్డేలు ఆడిన గుర్నూర్‌ బ్రార్‌.. 23 వికెట్లతో సత్తా చాటాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డేల్లోనూ 26 ఏళ్ల ఈ రైటార్మ్‌ పేసర్‌ రాణించాడు. అయితే, టెస్టుల్లో మాత్రం ఇప్పటి వరకు అతడికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌- టీమిండియా మధ్య వెల్లింగ్‌టన్‌ వేదికగా తొలి టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడిన భారత జట్టు
కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, దేవదత్‌ పడిక్కల్‌, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌, ఆకాశ్‌ దీప్‌, అన్షుల్‌ కాంబోజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్‌ కృష్ణ.
బెంచ్‌: సాయి సుదర్శన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌, గుర్నూర్‌ బ్రార్‌.

ఇదీ చదవండి: సౌతాఫ్రికా క్రికెటర్‌ ప్రపంచ రికార్డు.. 149 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
వైభవ్‌ ప్రతిభావంతుడే.. కానీ ఇదేం పద్ధతి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement