న్యూఢిల్లీ: 2036 ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి తమ ప్రణాళికలు, మౌలిక సౌకర్యాలు, శక్తి సామర్థ్యాలు, ఆర్థిక వనరులు తదితర అంశాలతో నేడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ముందు భారత క్రీడాధికారుల బృందం ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ప్రతిష్టాత్మక క్రీడల నిర్వహణలో భారత్‌కు ఉన్న అనుభవంతో పాటు ఇప్పటికే 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులు సొంతం చేసుకున్న విషయాన్ని ప్రజెంటేషన్‌లో వివరించనున్నారు.
గత ఏడాది కాలంలో వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి 36 అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించిన భారత్ వచ్చే రెండేళ్లలో మరో 19 అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్‌తో పాటు జర్మనీ, హంగేరి, ఖతర్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, తుర్కియే దేశాలు పోటీ పడుతున్నాయి. తుర్కియే ఇప్పటికే తమ ప్రజెంటేషన్ ఇచ్చింది. 2029 రెండో అర్ధభాగంలో నిర్వహించే ఐఓసీ సమావేశాల్లో ఓటింగ్ ద్వారా ఆతిథ్య దేశాన్ని ప్రకటిస్తారు.


