source: X
భారత క్రికెట్‌లో 3D ప్లేయర్‌గా గుర్తింపు ఉన్న విజయ్ శంకర్ ఇటాలియా టీ10 లీగ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఈ లీగ్‌లో వెనిస్ లైవ్‌వైర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. మిలన్ ఐకాన్స్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ (20 బంతుల్లో అజేయమైన 34 పరుగులు) ఆడి తన జట్టుకు విజయాన్నందించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
విజయ్ శంకర్ తాజాగా అదే తరహా ప్రదర్శనను రిపీట్ చేశాడు. ఈసారి బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించి తన జట్టుకు విజయాన్నందించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
బ్రెసియా లయన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయ్ తొలుత బ్యాట్‌తో సత్తా చాటాడు. 19 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అనంతరం బౌలింగ్‌లోనూ రాణించి ఒక వికెట్ పడగొట్టాడు. విజయ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా వెనిస్ లైవ్‌వైర్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.
విజయ్‌కు తొలుత ఈ టోర్నీలో ఆడే అవకాశం రాలేదు. శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స తప్పుకోవడంతో అతడి స్థానంలో లేట్‌గా జట్టులోకి వచ్చాడు. డేవిడ్ మలాన్ కెప్టెన్సీలోని ఈ జట్టులో క్రిస్ గేల్, జేజే స్మట్స్, కేఆర్ కరియప్ప వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. విజయ్ భారత దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌కు 2026 మేలో వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి విదేశీ టీ10, టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు
ఇదీ చదవండి: కెప్టెన్సీపై కీలక సంకేతమిచ్చిన ముంబై ఇండియన్స్


