పాక్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఆ నలుగురి కెరీర్ ఖేల్‌ఖతం! | Pakistan Head Coach-Mike Hesson Hints-Career Over-Rizwan-Imam-2-Others | Sakshi
Sakshi News home page

పాక్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఆ నలుగురి కెరీర్ ఖేల్‌ఖతం!

Nov 25 2026 1:23 PM | Updated on Nov 25 2026 1:23 PM

Pakistan Head Coach-Mike Hesson Hints-Career Over-Rizwan-Imam-2-Others

Photo Credit: Twitter

పాకిస్తాన్ క్రికెట్‌లో సీనియర్లుగా చెలామణి అవుతున్న మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌, షాన్ మసూద్‌, నోమన్ అలీ కెరీర్ దాదాపు ముగింపు దశకు వచ్చినట్లేననే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించిన 2026-27 సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా నుండి ఈ నలుగురిని తప్పించింది. 

హెడ్ కోచ్ మైక్ హెసన్ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా వీరికి మరో అవకాశం ఇచ్చేది లేదని సెలెక్టర్లకు స్పష్టం చేసినట్లు రిపోర్టులు వస్తున్నాయి. నవంబర్ 21న పీసీబీ ప్రకటించిన 38 మంది ఆటగాళ్ల కొత్త జాబితాలో ఈ నలుగురికి చోటు దక్కలేదు. కొత్త విధానంలో కేవలం టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం, సల్మాన్ అలీ అఘాలకు మాత్రమే టెస్ట్, వన్డే క్రికెట్‌లో కాంట్రాక్టులో చోటు కల్పించారు.

సీనియర్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ మాత్రం కాంట్రాక్టులకు, జట్టు ఎంపికకు సంబంధం లేదని పైకి చెబుతున్నా, హెడ్ కోచ్ మైక్ హెసన్ మాత్రం పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి, సెలెక్టర్లకు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. రిజ్వాన్, షాన్, ఇమామ్, నోమన్‌లకు మరో ఛాన్స్ ఇవ్వబోమని తేల్చిచెప్పారు

ఆగస్టు 2026లో ఇంగ్లండ్ చేతిలో 3-0తో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్ కావడం, ఆ సిరీస్ మధ్యలోనే రిజ్వాన్, ఇమామ్‌లను స్వదేశానికి వెనక్కి పంపడం వీరి కెరీర్‌కు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ చేతిలో వరుస ఓటములు, విదేశీ గడ్డపై వరుసగా 7 టెస్టులు ఓడిపోవడంతో జూలై 2026లో షాన్ మసూద్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాదు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఆ తర్వాత బాబర్ ఆజంకు టెస్ట్ పగ్గాలు అప్పగించారు.

ఈ నలుగురు ఆటగాళ్లు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ, 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC), తదుపరి ఐసీసీ టోర్నీల కోసం పాకిస్థాన్ యువ ఆటగాళ్లతో కొత్త జట్టును నిర్మిస్తోంది. దీంతో ఈ నలుగురు పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ (క్వాయిద్-ఎ-అజామ్ ట్రోఫీ), విదేశీ లీగ్‌ల్లో (కౌంటీ క్రికెట్, పీఎస్‌ఎల్) ఆడే అవకాశముంది.

34 ఏళ్ల మహ్మద్ రిజ్వాన్ 47 టెస్టుల్లో 2,682 ప‌రుగులు, 103 వ‌న్డేల్లో 2,979 ప‌రుగులు, 106 టీ20ల్లో 3,414 ప‌రుగులు సాధించాడు. ఇక షాన్ మ‌సూద్ 50 టెస్టులాడి 2,926 ప‌రుగులు సాధించాడు. కెప్టెన్‌గా 16 టెస్టుల్లో 12 ఓట‌ములు చ‌విచూసి జూలై 2026లో కెప్టెన్సీ కోల్పోయాడు. 

30 ఏళ్ల ఇమామ్ ఉల్‌హ‌క్ 31 టెస్టులాడి 1,865 ప‌రుగులు, 75 వ‌న్డేల్లో 3,152 ప‌రుగులు సాధించాడు. 40 ఏండ్ల నోమ‌న్ అలీ వ‌య‌సు రీత్యా సెంట్ర‌ల్ కాంట్రాక్ట్  జాబితాలో చోటు కోల్పోయాడు. నోమ‌న్ 22 టెస్టుల్లో 101 వికెట్లు తీయ‌గా, ఇందులో తొమ్మిదిసార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు.

ఇదీ చదవండి: వైభవ్‌ సూర్యవంశీ బద్దలు కొట్టిన ప్రపంచ రికార్డులు ఇవే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement