వియాన్ ముల్దర్ (PC: ProteasMenCSA X)
సౌతాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్దర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో పాటు.. ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
2-0తో వైట్‌వాష్
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు సందర్భంగా వియాన్ ముల్దర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన సౌతాఫ్రికా 2-0తో వైట్‌వాష్ చేసింది. జొహెన్నస్‌బర్గ్ వేదికగా తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన ప్రొటిస్ జట్టు.. సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ మీద 219 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.
178 బంతుల్లో శతకం
రెండో టెస్టులో సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన వియాన్ ముల్దర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ఈ ఆల్‌రౌండర్.. 178 బంతుల్లో శతకం (100) పూర్తి చేసుకుని అవుటయ్యాడు.
ఏడు వికెట్లతో చెలరేగి
ఇక బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసిన వియాన్ ముల్దర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఏకంగా ఏడు వికెట్లు కూల్చి బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. పదకొండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చి.. తాంజిద్ హసన్ తమీమ్ (29), మొమినుల్ హక్ (0), కెప్టెన్ నజ్ముల్ షాంటో (34), లిటన్ దాస్ (15), జేకర్ అలీ (2), షోరిఫుల్ ఇస్లాం (0), టస్కిన్ అహ్మద్ (10) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
జింబాబ్వే మీద ట్రిపుల్ సెంచరీ.. ఇప్పుడిలా
ఇదిలా ఉంటే.. గతేడాది బులవాయో వేదికగా జింబాబ్వేతో టెస్టులో వియాన్ ముల్దర్ 367 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కూల్చాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ నమోదు చేయడంతో పాటు ఏడు వికెట్ల హాల్ సాధించిన ఏకైక క్రికెటర్‌గా వియాన్ ముల్దర్ రికార్డు నెలకొల్పాడు.
అంతేకాదు.. ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు ఏడు వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగానూ వియాన్ ముల్దర్ నిలిచాడు. ఇక 1980 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గానూ చరిత్రకెక్కాడు. నాడు ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బోతమ్ ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు ఏడు వికెట్లు తీశాడు.
ఇవీ చదవండి: హెడ్‌కోచ్‌గా కేన్ విలియమ్సన్.. ప్రకటన విడుదల
వైభవ్ ప్రతిభావంతుడే.. కానీ ఇదేం పద్ధతి?
A Destructive Spell! 💥 Wiaan Mulder tore through the Bangladesh batting line-up with a sensational career-best 7/31 to bring the innings to a close and all but seal the second Test victory for #TheProteas! 🎯🇿🇦 A magnificent display with the ball from the all-rounder! 👏 #Unbreakable #SAvBAN
— Proteas Men (@ProteasMenCSA) November 25, 2026


