టాపార్డర్‌ ధనాధన్‌.. ఖాన్‌ బ్రదర్స్‌ మెరుపులు.. సూర్య విఫలమైనా.. | SMAT 2026 Top Order Bolwers Shines Mumbai Beat Uttarakhand SKY Fails | Sakshi
Sakshi News home page

టాపార్డర్‌ ధనాధన్‌.. ఖాన్‌ బ్రదర్స్‌ మెరుపులు.. సూర్య విఫలమైనా..

Nov 26 2026 12:26 PM | Updated on Nov 26 2026 12:34 PM

SMAT 2026 Top Order Bolwers Shines Mumbai Beat Uttarakhand SKY Fails

ముంబై జట్టు (PC: Suryakumar Yadav X)

దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026 సీజన్‌లో ముంబై జట్టు ఆరో విజయం నమోదు చేసింది. ఎలైట్‌ గ్రూప్‌-‘డి’లో​ భాగంగా ఉత్తరాఖండ్‌తో గురువారం తలపడ్డ ముంబై.. 86 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

టాపార్డర్‌ ధనాధన్‌
కోల్‌కతా వేదికగా టాస్‌ గెలిచిన ఉత్తరాఖండ్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో అంగ్‌క్రిష్‌ రఘువంశీ మెరుపు అర్ధ శతకం (34 బంతుల్లో 51)తో అదరగొట్టగా.. హార్దిక్‌ తామోర్‌ ధనాధన్‌ (14 బంతుల్లో 39) దంచికొట్టాడు.

ఖాన్‌ బ్రదర్స్‌ మెరుపులు
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ముషీర్‌ ఖాన్‌ హాఫ్‌ సెంచరీ (40 బంతుల్లో 65)తో మెరవగా.. ముషీర్‌ అన్నయ్య సర్ఫరాజ్‌ ఖాన్‌ (15 బంతుల్లో 31) కూడా దుమ్ములేపాడు. మిగిలిన వారిలో శివం దూబే డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (1) పూర్తిగా విఫలమయ్యాడు. మిగతా వారిలో శార్దూల్‌ ఠాకూర్‌ (10) ఒక్కడే సింగిల్‌ డిజిట్‌ స్కోరు దాటగలిగాడు.

ఈ క్రమంలో 19.5 ఓవర్లలో ముంబై 209 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో రవీందర్‌ నేగి, జగదీశ సుచిత్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. జన్‌మేజయ్‌ జోషి, అన్మోల్‌ షా తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

123 పరుగులకే ఆలౌట్‌
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్‌ జట్టు 16.5 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌట్‌ అయింది. ముంబై బౌలర్లలో అథర్వ ఆంకోలేకర్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. మాక్స్‌వెల్‌ స్వామినాథన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. శివం దూబే, సాయిరాజ్‌ పాటిల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ముషీర్‌ ఖాన్‌ తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

సూర్యకుమార్‌ సేనకు ఇది ఆరో గెలుపు
ఉత్తరాఖండ్‌ బ్యాటర్లలో శాశ్వత్‌ దంగ్వాల్‌ 37 పరుగులతో రాణించగా.. కెప్టెన్‌ కునాల్‌ చందేలా, జగదీశ సుచిత్‌ చెరో 19 పరుగులతో ఫర్వాలేదనిపించారు. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ముంబై 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఎలైట్‌ గ్రూప్‌-‘డి’లో ఉన్న ముంబై జట్టు ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు ఆడగా.. ఆరింట గెలుపొంది టాపర్‌గా కొనసాగుతోంది.

ఇవీ చదవండి: అతడు సూపర్‌ బౌలర్‌.. అరంగేట్రానికి సిద్ధమే: టీమిండియా కోచ్‌
Asia Cup Rising Stars: సెమీ ఫైనల్స్‌ షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement